ఉమ్మడి జిల్లాలో అడ్డగోలుగా కోచింగ్ సెంటర్ల నిర్వహణ
● ఐఐటీ, నీట్, ఎఫ్‌సెట్ వంటి వాటికి కొత్త ట్రెండ్
● నవోదయ, గురుకుల, సైనిక్ స్కూల్ పోటీ పరీక్షలకు సైతం శిక్షణ
● షార్ట్, లాంగ్‌టర్మ్ కోచింగ్, హాస్టళ్లు సైతం కొనసాగింపు
● అన్నీ తెలిసినా.. పట్టనట్లుగా అధికారుల తీరు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆశలను ఆసరాగా చేసుకొని ప్రైవేటు కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు విద్యాశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ, ఇక్కడి కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు వాటిని తుంగలో తొక్కి ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్, పదో తరగతి పరీక్షలు ముగియగా.. ఎంసెట్, ఐఐటీ, నీట్ వంటి వాటికి డిమాండ్ ఉండడంతో పెద్దఎత్తున లాంగ్‌టర్మ్, షార్ట్‌టర్మ్ కోచింగ్ ఇస్తున్నారు. గతంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌కు శిక్షణ ఇచ్చిన కోచింగ్ సెంటర్లు సైతం ప్రస్తుతం ఐఐటీ, నీట్‌కు శిక్షణ ఇవ్వడం గమనార్హం. వీటితోపాటు నవోదయ, గురుకులాలు, సైనిక్ స్కూల్స్‌కు సైతం పెద్దఎత్తున కోచింగ్ సెంటర్లు వెలిశాయి. వీటికి అనుమతులు లేకపోవడంతోపాటు కనీసం ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోకుండా ఏర్పాటు చేస్తుండగా విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది.


