సమాజాన్ని సంస్కరించడమే కవి పని | - | Sakshi
Sakshi News home page

సమాజాన్ని సంస్కరించడమే కవి పని

Apr 27 2026 7:24 AM | Updated on Apr 27 2026 7:24 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: సమాజాన్ని సంస్కరించడమే కవి పని అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి డాక్టర్‌ నందిని సిధారెడ్డి అన్నారు. పాలమూరు సాహితీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రం లిటిల్‌ స్కాలర్స్‌ హైస్కూల్‌లోని కాళోజీ హాల్‌లో ప్రముఖ కవి, విద్యావేత్త కె.లక్ష్మణ్‌గౌడ్‌ రచించిన ‘నిశ్శబ్దం మాట్లాడితే’ కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా, ఆవిష్కర్తగా హాజరై మాట్లాడారు. లక్ష్మణ్‌గౌడ్‌ స్థానిక సమస్యలనే కాకుండా అంతర్జాతీయ సమస్యలను సైతం అద్భుతంగా కవిత్వం రాశారన్నారు. ధిక్కారంతో రాసిన కవిత్వం ఇందులో కనిపిస్తుందన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎస్‌.రఘు మాట్లాడుతూ లక్ష్మణ్‌గౌడ్‌ కవిత్వం సమకాలిన సమస్యలను బలంగా ఆవిష్కరించిందన్నారు. నిరంతరం కవిత్వం రాస్తూ సమాజాన్ని తట్టిలేపే ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు. పుస్తక సమీక్షకులు, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్‌ వంగీపురం శ్రీనాథాచారి మాట్లాడుతూ ప్రపంచ కవులైన ఇలియట్‌, జాన్‌కిట్స్‌, ప్లాబో నెరుడా వంటి వారు రాసిన కవిత్వం లక్ష్మణ్‌గౌడ్‌ కవిత్వంలో కనిపిస్తుందన్నారు. ఆయన కవిత్వంలో శ్రీశ్రీ ధిక్కారం, కాళోజీ ప్రజాస్వరం కనిపిస్తుందన్నారు. ప్రముఖ న్యాయవాది వి.మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ లక్ష్మణ్‌గౌడ్‌ కవిత్వం రాస్తూ సమాజాన్ని చైతన్యపరుస్తున్నారని పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని ప్రసిద్ధ విద్యావేత్త, అనువాదకులు జలజం సత్యనారాయణకు అంకితం చేశారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది బుర్రి వెంకట్రారెడ్డి, ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వరరెడ్డి, లిటిల్‌ స్కాలర్స్‌ పాఠశాల కరస్పాండెంట్‌ అరుంధతీరాయ్‌, సంయుక్తరాయ్‌, పాలమూరు సాహితీ అధ్యక్షుడు డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌, బాదేపల్లి వెంకటయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement