నారాయణపేట: రైతుల సంక్షేమమే లక్ష్యంగా తమ సంఘం ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటలకు మద్దతు ధరలు నిర్ణయించి చట్టబద్ధంగా అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో నేడు రైతులకు రూ.4 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి క్వింటాకు సుమారు 5 కిలోల తరుగు చూపిస్తున్నారని.. అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. ఇటీవల కొత్తగూడెంలో మూడురోజుల పాటు రాష్ట్ర మూడో మహాసభలు విజయవంతంగా కొనసాగాయని.. మహాసభల్లో రైతులకు సంబంధించిన 31 అంశాలపై చర్చించి తీర్మానం చేసినట్లు చెప్పారు. రైతుభరోసా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్యగౌడ్ మాట్లాడుతూ.. పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూ నిర్వాసితులకు నష్ట పరిహారంతో పాటు అర్హులైన వారికి ఇల్లు, స్థలాలు, వారి పిల్లలకు గురుకులాల్లో చదివేందుకు అవకాశం కల్పించాలని కోరారు. సీఎంఆర్ అప్పగించని మిల్లులపై చర్యలు తీసుకోవాలని, అవినీతికి పాల్పడిన మిల్లు యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండమీది బలరాం, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుండెగారి దస్తప్ప తదితరులు పాల్గొన్నారు.


