రాజకీయ వర్గాల్లో చర్చ
● పీఏసీఎస్ పదవులు ఇక నామినేటెడ్
● నూతన సంస్కరణలా..?
రాజకీయ వ్యూహమా..?
● ఎమ్మెల్యేల చేతుల్లోకి పీఏసీఎస్ పగ్గాలు
● డీసీసీబీకి కూడా
నామినేటేడ్ చేసే అవకాశం
అచ్చంపేట: రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)పాలక వర్గాలకు నామినేటెడ్ పద్ధతిలో కొత్త కార్యవర్గాలను నియమించాలనే నిర్ణయం రాజకీయ వేడెక్కించింది. 2025 ఫిబ్రవరిలో పాలకవర్గాల గడువు ముగిసింది. గత పాలకవర్గాలనే పర్సన్ ఇన్‌చార్జి మేనేజింగ్ కమిటీలుగా ఆరు నెలల పాటు కొనసాగిస్తూ ఫిబ్రవరి 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత నిరవధికంగా మరో ఆరు నెలలు గడువును పొడిగిస్తూ ఆగస్టు 14న ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా గడువు ఉన్నప్పటికీ అకస్మాత్తుగా డిసెంబర్ 19న ప్రభుత్వం పాలకవర్గాలను రద్దు చేసింది. కాగా..ఊహించినట్లుగానే గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పదవీకాలం ముగిసిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు త్వరలోనే నామినేటేడ్ పద్ధతిన పాలకవర్గాలను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలో 76 పీఏసీఎస్‌లు ఉన్నాయి. వీటి అన్నింటికి త్వరలోనే కొత్త పాలక వర్గాలను ఏర్పాటు చేయనున్నారు. మరో వైపు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)జిల్లా మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)లకు కూడా పాలకవర్గాలను నామినేటేడ్ చేసే అవకాశం ఉంది.
ఇక డైరెక్టర్ల ఎంపికలో పాత పద్ధతిలో అనుసరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముగ్గురు లేదా ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సహకార శాఖ వర్గాల ప్రకారం ఈ కమిటీలో చైర్మన్, వైస్ చైర్మన్, మిగిలిన వారిని డైరెక్టర్లుగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఆమోదం తరువాత నామినేటేడ్ కమిటీల నియామక ప్రక్రియ త్వరలోనే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల మాదిరిగా ఇందులో స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జి మంత్రుల నేతృత్వంలో కమిటీల ఎంపిక చేయనున్నారు. దీంతో అధికార పార్టీకి చెందిన నేతల్లో హర్షం వ్యక్తవుతుంటే, ప్రతిపక్షాలు దీనిని ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయంగా అభివర్ణిస్తున్నాయి. పీఏసీఎస్ పాలనపై నియంత్రణను స్థానిక ఎమ్మెల్యేల చేతుల్లోకి అప్పగించేలా ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయన్న ప్రచారం కూడా బలంగా వినిపిస్తోంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో 76 సొసైటీలుంటే.. నాగర్‌కర్నూలు జిల్లాలో 23, వనపర్తి15, జోగుళాంబగద్వాల 11, మహబుబ్‌నగర్17, నారాయణపేట 10 చొప్పున సొసైటీలు పని చేస్తున్నాయి. మరో 20 కొత్త సొసైటీలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు వెళ్లాయి. దీంతో సొసైటీల పరిధిలో 380 మంది డైరెక్టర్లకు అవకాశం ఉంటుంది. ఇందులో నుంచి 76 మంది చైర్మన్లు, 76 మంది వైస్ చైర్మన్లను నియమిస్తారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందిన అధికార పక్షం నేతలు పీఏసీఎస్‌లను ఎలాగైనా దక్కించుకోవాలనే ప్రయత్నాలు ఇప్పటి నుంచి మొదలు పెట్టారు. ప్రభుత్వం నామినేటేడ్ వైపు మొగ్గు చూపిస్తున్న తరుణంలో అధికార పార్టీ నాయకులకు పోటీ లేకుండానే సహకార సొసైటీలో పదవులు దక్కే అవకాశం దక్కుతుంది.
పీఏసీఎస్‌ల గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం ఆరు నెలల చొప్పున రెండుసార్లు గడువు పొడిగిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆదే జీఓను కొనసాగిస్తూ అకస్మాత్తుగా రద్దు చేయడం, తిరిగి నామినేటేడ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈసారి ఎన్నికలు నిర్వహించకుండా నామినేటేడ్ చేయనున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు మరింత చికాకుగా మారాయి. సహకార ఎన్నికల స్వస్తి పలికి, నామినేటేడ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేసేందుకు మొగ్గు చూపుతున్న తరుణంలో రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేస్తోంది.


