గ్రామీణ ప్రజలకు తప్పని ఇక్కట్లు..
● రెండో రోజు కొనసాగిన
ఆర్టీసీ కార్మికుల సమ్మె
● నామమాత్రపు సర్వీసులతో
ప్రయాణికుల ఇక్కట్లు
● ప్రైవేటు వాహనాల్లో
రెట్టింపు ధరతో దోపిడీ
నారాయణపేట రూరల్: ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగింది. జిల్లాలోని ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లు విధులకు హాజరుకాలేదు. స్థానిక బస్టాండ్ ఆవరణలో శాంతియుతంగా నిరసన వ్యక్తంచేశారు. పోలీసులతో కలిసి ఆర్టీసీ అధికారులు ప్రైవేటు బస్సులను రోడ్డుపైకి పంపించారు. తాత్కాలిక పద్ధతిన కాంట్రాక్టు సిబ్బందిని ఎంపికచేసి.. సంస్థకు చెందిన బస్సులను సైతం నడిపించారు. మొత్తానికి గురువారం నారాయణపేట డిపోలో 94 సర్వీసులకు గాను 56 బస్సులు ప్రధాన రూట్లలో ఆపరేట్ చేశారు. వీటిలో 8 సంస్థకు చెందినవి కాగా.. 48 అద్దె బస్సులను మహబూబ్‌నగర్, హైదరాబాద్, మక్తల్, మద్దూరు, కోస్గి మార్గాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు.
ఆదాయం లేకుండానే?
కార్మికుల సమ్మె ప్రభావం కనిపించకుండా.. ప్రయాణికులకు రవాణా ఇబ్బందులు తొలగించాలనే ఉద్దేశంతో ఆర్టీసీ అధికారులు చాలావరకు బస్సులను రోడ్లపైకి పంపించారు. పూర్తిస్థాయిలో అద్దె బస్సులను నడిపించగా.. వాటిలో కొంతవరకు డ్రైవర్లే టికెట్ పేరుతో డబ్బులు సేకరించారు. మరోవైపు పల్లెవెలుగు బస్సుల్లో ఆడ, మగవారికి డబ్బులు లేకుండానే గమ్యస్థానాలకు చేర్చారు. ఒక బస్సులో అలా.. మరో బస్సులో ఇలా.. టికెట్టు పేరుతో డబ్బులను తీసుకోవడంపై గొడవలు జరిగాయి. ఏదేమైనా రోజువారీగా రూ. లక్షల్లో వచ్చే ఆదాయం.. సమ్మె కాలంలో కనీసం రూ.వేలల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఆదాయం లేకుండానే ఆర్టీసీ బస్సులను నడిపిస్తుంది.
కార్మికులకు మద్దతు..
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పలు సంఘాలు ప్రత్యక్షంగా మద్దతు తెలిపాయి. కార్మికులకు బీసీ జాగృతి సేన, టీయూసీఐ, బీజేపీ, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, సామాజిక కార్యకర్తలు అండగా నిలిచారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి.. సమ్మె విరమణకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వారు కోరారు.
భద్రతా చర్యలను పరిశీలించిన ఎస్పీ..
జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోను ఎస్పీ డా.వినీత్ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కార్మికుల సమ్మె నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్‌ఐ వెంకటేశ్వర్లకు సూచించారు. అనంతరం ఆర్టీసీ జేఏసీ నాయకులతో మాట్లాడారు. అదే విధంగా భద్రతా ఏర్పాట్లను సీఐ శివశంకర్ పర్యవేక్షించారు.
ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి వచ్చాయని విషయం తెలుసుకున్న ప్రజలు యథావిధిగా తమ కార్యకలాపాల నిర్వహణకు బస్సులపై ఆధారపడ్డారు. అయితే ప్రధాన మార్గాల్లోనే బస్సులు నడవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇక ఉద్యోగులు, వ్యాపారుల సైతం చాలీచాలని బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణించారు. ఉదయం వేళలోనే సమయపాలన లేకుండా నడపడంతో సాయంత్రానికి బస్సుల కొరత తీవ్రంగా కనిపించింది. దీంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు వాహనదారులు రెట్టింపు ధరలతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు.
రీజియన్‌లో 426 బస్సులు రోడ్డెక్కాయి..
రెండు రోజు గురువారం మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు ఆర్టీసీ అధికారుల వివరాలు మేరకు 925 బస్సులకుగాను 426 బస్సులు మాత్రమే నడిచాయి. 57 ఆర్టీసీ బస్సులు, 346 ప్రైవేట్ హైర్ బస్సులు, 23 ఈవీ బస్సులు నడిచాయి.


