శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

Apr 23 2026 7:30 AM | Updated on Apr 23 2026 7:30 AM

నారాయణపేట: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు జిల్లా పోలీస్‌ శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టిందని.. ఆర్టీసీ కార్మికులు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. సమ్మె కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర సేవలు వినియోగించే ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్‌, రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రైవేట్‌ డ్రైవర్లు తాత్కాలికంగా విధుల్లోకి వచ్చినా, అలాగే ఆర్టీసీ డ్రైవర్లు తిరిగి డ్యూటీలో చేరినా వారికి ఎటువంటి బెదిరింపులు లేకుండా పూర్తి స్థాయి పోలీస్‌ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. బస్సుల రాకపోకలు, డిపో ప్రాంతాలు, ముఖ్య కూడళ్లు, బస్టాండ్‌ పరిసరాల్లో అదనపు పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించినా.. ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ ఆస్తులకు నష్టం కలిగించినా, అధికారులపై దాడులకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం వ్యాప్తి చేసిన వారిపైనా పర్యవేక్షణ కొనసాగుతోందని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమ్మెలో పాల్గొనే కార్మికులు, ప్రజలు పరస్పర సంయమనం పాటిస్తూ, ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా సమ్మె చేసుకోవాలని సూచించారు. ప్రజల శాంతి భద్రతలను కాపాడటంలో పోలీస్‌ శాఖకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని లేదా డయల్‌ 100 కి సమాచారం ఇవ్వాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement