● ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● కలెక్టర్ ప్రతీక్ జైన్
నారాయణపేట: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న అన్ని గ్రామపంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి సమావేశ మందిరంలో గ్రామసభల నిర్వహణపై అడిషనల్ కలెక్టర్లు శ్రీను, ఫణీంద్రరెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పురోగతి, రైతుభరోసా, రైతుబీమా, రైతు రుణమాఫీ, సాయిల్ హెల్త్‌కార్డ్, వ్యవసాయ తదితర పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిన వారి వివరాలను పారదర్శకంగా ప్రదర్శించాలని అధికారులకు సూచించారు. గ్రామసభల నిర్వహణకు ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసి పంచాయతీ కార్యదర్శులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. నిర్దేశించిన ప్రాంతంలో గ్రామసభ నిర్వహణతో పాటు గ్రామంలో ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిన వారి జాబితా చదివి వినిపించాలని ఆదేశించారు. వ్యవసాయ, విద్య, హౌసింగ్, ఇరిగేషన్, విద్యుత్‌శాఖ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. గ్రామసభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా టెంట్లు, కుర్చీలు, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ప్రత్యేకంగా దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారి నుంచి వినతులు స్వీకరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.


