ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
నారాయణపేట: పంచాయతీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న ప్రతి సిబ్బందికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని నిర్వహించిన వీసీలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, సాధారణ పరిశీలకురాలు సీతాలక్ష్మి పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రకటన నియమాలు, ఏకగ్రీవ స్థానాలలో ఉప సర్పంచ్ ఎన్నిక, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు, నామినేషన్లపై వచ్చే ఫిర్యాదులు తదితర అంశాలపై సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ వచ్చిన ప్రతి దరఖాస్తు పరిశీలించి తప్పనిసరిగా అర్హులకు పోస్టల్ బ్యాలెట్ అందించాలని, ప్రతి గ్రామం, మండలాల వారీగా వివరాలు సేకరించి సంబంధిత రిటర్నింగ్ అధికారులు పోస్టల్ బ్యాలెట్ జారీ చేసేలా చూడాలన్నారు. మొదటి విడత పోలింగ్ జరిగే గ్రామాల్లో ఓటు హక్కు ఉండి ఎన్నికలు విధులు నిర్వహించే సిబ్బంది ఈ నెల 8న, రెండో విడత వారికి 12, మూడో విడత వారికి 15న పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు.
ఎన్నికల సామగ్రి పంపిణీ పర్యవేక్షణ
ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన సామగ్రి పంపిణీని కార్యక్రమాన్ని కలెక్టర్ పర్యవేక్షించారు. జిల్లాకేంద్రానికి సమీపంలోని ఓ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించి బ్యాలెట్ పేపర్లను పరిశీలించారు. రెండు, మూడో విడత ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్న బ్యాలెట్ బాక్సులతోపాటు ఇంకా ఏమైనా అవసరమైతే తెప్పించుకోవాలని అధికారులకు సూచించారు.


