అక్రమాలపై విచారణ ఏది..?
నారాయణపేట రూరల్: జిల్లాలోని కేజీబీవీలలో పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్లు (ఎస్‌ఓ) అక్రమాలకు పాల్పడుతున్నట్లు బహిరంగంగా ఆరోపణలు వస్తున్నా.. వారిపై విచారణ జరిపించడంలో విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గత నెల 26న ‘సాక్షి’లో ‘కస్తూర్బాలు.. అక్రమాలకు నిలయాలు’ అనే శీర్షికతో వచ్చిన కథనంపై ధన్వాడ ఎస్‌ఓను మాత్రం విధుల నుంచి తొలగించి చేతులు దులుపుకొన్నారు. ఇదే క్రమంలో కోస్గి, కృష్ణా కేజీబీవీలో సైతం జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టలేదు. నామమాత్రంగా కమిటీ వేసి కాగితాలకే పరిమితం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ రికార్డులలో ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పులు సరి చేసుకునేందుకే కాలయాపన జరుగుతున్నట్లు విద్యాశాఖలో చర్చించుకుంటున్నారు. ఓ ఉపాధ్యాయ సంఘం నాయకుడు, రాజకీయ పార్టీ నాయకుల ఒత్తిళ్లతోనే ఆగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం.
కోస్గి కేజీబీవీలో..
పారదర్శత కోసం పాఠశాలలో ప్రవేశపెట్టిన ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం జిల్లాలో ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన మూడు నెలల తర్వాత అధికారికంగా అమలు అయ్యింది. అయితే సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలోని కోస్గి కేజీబీవీలో మాత్రం మెనూ ప్రకారం భోజనం పెట్టడం కల అనే చెప్పాలి. ఎఫ్‌ఆర్‌ఎస్ రాక ముందు అక్కడ వాస్తవంగా చదువుతున్న విద్యార్థుల కంటే 70 మంది వరకు ఎక్కువ ఎన్‌రోల్‌మెంట్ చూపి డైట్ బిల్ అధికంగా నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రెండు నెలలపాటు అలాగే కొనసాగించినట్లు తెలిసింది. పరిశీలనకు వెళ్లిన అధికారులకు మాత్రం లాంగ్ ఆబ్సెంట్ అంటూ దాటవే స్తూ కప్పిపుచ్చుకున్నారు. కానీ, గట్టిగా ప్రశ్నిస్తే కొందరికి టీసీలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నా యి. కాగా ఆ 70 మంది వరకు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నట్లు తెలుస్తుంది. గత విద్యా సంవత్సరం (2024– 25) మార్చిలో వచ్చిన నిధులు సైతం ఇష్టారీతిగా ఖర్చుల లెక్కలు రాసి బిల్లులు సబ్మిట్ చేసినట్లు తెలుస్తోంది. రూ.10 వేల బిల్లులను రూ.30 వేలు రాశారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే మెనూ పాటించకుండా నాణ్యతలేని భోజనం వడ్డించడం రోజు వారి దినచర్య. ఈ క్రమంలో ఓ విద్యార్థిని తల్లిదండ్రులు భోజనం నాణ్యతపై ప్రశ్నిస్తే వారితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడగా, ఆయన డీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. దీంతో మరింత కోపో ద్రిక్తులైన ఎస్‌ఓ ఆయనకు ఫోన్ చేసి భయబ్రాంతులకు గురిచేస్తూ.. కేజీబీవీకి వచ్చి అమ్మాయిల విషయంలో అనుచితంగా ప్రవర్తించావని, రివర్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించినట్లు తెలిసింది. మెనూ ప్రకారం ఏ ఒక్క రోజు భోజనం, స్నాక్స్ ఇవ్వరని ఆరోపణలున్నాయి. నిబంధనల కు విరుద్ధంగా పత్రిక ప్రకటన లేకుండా, లోపాయికారిగా పీఈటీని నియమించుకోగా.. ఎస్‌ఓ ప్రవర్తన నచ్చక రెండు నెలలకే మానేసినట్లు సమాచారం. అక్కడ పనిచేస్తున్న సీఆర్టీలతోనూ సఖ్యతగా ఉండటం లేదని, ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా అధికారు లు తనిఖీకి వస్తే సామాజిక వర్గం పేరుతో బెదిరించడం, విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జర్నలిస్టులు సమాచారం కోరితే రాజకీ య నాయకులతో ఫోన్ చేసి తనపై పత్రికల్లో కథ నాలు రాకుండా అడ్డుకుంటున్నట్లు తెలిసింది.
విచారణ జరిపిస్తాం..
జిల్లాలోని కేజీబీవీలపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తున్నాం. ఇప్పటికే ధన్వాడ ఎస్‌ఓను టెర్మినెట్ చేశాం. కోస్గి, కృష్ణ కేజీబీవీలలో విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీ వేశాం. స్థానిక ఎంఈఓతోనూ కలిసి విచారణ చేసి రిపోర్ట్ ఇస్తారు. తర్వాత కలెక్టర్‌కు నివేదించి తప్పు అని తేలితే చర్యలు తీసుకుంటాం.
– గోవిందరాజులు, డీఈఓ
కృష్ణా కేజీబీవీలో..
మంత్రి వాకిటి శ్రీహరి నియోజకవర్గంలోని కృష్ణా మండల కేజీబీవీలో డైట్ బిల్లుల అక్రమాలు బయటపడరాదని ఉద్దేశంతో అక్కడి ఎస్‌ఓ నిరంతరం వంటవారిని మారుస్తున్నట్లు సమాచారం. రాజీనామా లెటర్ లేకుండానే ఏడాదిలో ముగ్గురిని తొలగించి తనకు అనుకూలంగా ఉన్న కొత్తవారిని తీసుకున్నట్లు తెలిసింది. ఎందుకు తొలగించారో సమాధానం లేదని, వంట వారు కార్యాలయంలో ఫిర్యాదు చేసినా అధికారులు న్యాయం చేయలేదని బాధితులు వాపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, త్రిమెన్ కమిటీ ప్రమేయం లేకుండానే కొత్త వారి ఎంపిక చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా అక్కడ టార్చర్ భరించలేక ఓ విద్యార్థిని రాత్రి గోడ దూకి పారిపోగా గ్రామస్తులు తీసుకొచ్చి పాఠశాలలో అప్పజెప్పగా ఆ అమ్మాయికి టీసీ ఇచ్చి పంపినట్లు తెలిసింది. మార్చి నెలలో రూ.3.50 లక్షల నిధులు వస్తే ఇష్టానుసారంగా ఆదరాబాదరగా ఏప్రిల్లో బిల్లులు సబ్మిట్ చేసినట్లు తెలుస్తోంది. అక్రమాలకు సంబంధించి అధికారులు విచారణకు వస్తే ఉపాధ్యాయ సంఘాల నాయకులతో బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. రోజువారి ప్రార్థన విషయంలోనూ ఆరోపణలు లేకపోలేదు.
కమిటీ పేరుతో
కాలయాపనంటూ విమర్శలు
ఒత్తిళ్లకు తలొగ్గే వెనకడుగు అనేఅనుమానాలు
సీఎం, మంత్రి నియోజకవర్గాల్లోని కేజీబీవీలపై ఆరోపణలు
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందని ద్రాక్షే..


