
బోధన.. పరిశీలన
నారాయణపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అకాడమిక్ పర్యవేక్షణ కోసం జిల్లాస్థాయిలో సీనియర్ ఉపాధ్యాయులతో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వేర్వేరుగా స్కూళ్లకు సంఖ్య ఆధారంగా ప్యానెల్ ఇన్‌స్పెక్షన్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు నెలాఖరు నుంచి తనిఖీలు ప్రారంభించనున్నాయి. తనిఖీల్లో ఉపాధ్యాయులు పాఠాలు ఎలా బోధిస్తున్నారనేది ప్రధానంగా పరిశీలించనున్నారు. తనిఖీల్లో గుర్తించిన లోపాలను అదేరోజు ఉపాధ్యాయులకు వివరించి సరిదిద్దుకునేలా సూచనలు చేయనున్నారు. ఆయా బృందాలు మూడు నెలల్లో 100 స్కూళ్లను తనిఖీ చేసి ప్రతి నెల 5వ తేదీలోపు నివేదికను జిల్లా విద్యాధికారికి అందజేయాల్సి ఉంటుంది. అలాగే తనిఖీ నివేదికను రోజువారీగా ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేస్తారు.
ప్రతినెల నివేదికలు..
ప్రత్యేక బృందాలు వారికి కేటాయించిన పాఠశాలలను సందర్శించి ప్రగతిని అంచనా వేస్తారు. గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్ వినియోగం, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, పనితీరు తెలుసుకుంటారు. మధ్యాహ్న భోజనం అమలు, పారిశుద్ధ్యం, తాగునీరు ఇతర మౌలిక వసతులను పరిశీలిస్తారు. ప్రతినెల 5న డీఈఓకు అప్పటి వరకు అందుబాటులో ఉన్న వివరాలతో నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
స్వరూపం మార్చి..
వాస్తవానికి కమిటీలను గత మే నెలలోనే నియమించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా. ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. అప్పట్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు కలిపి ఒకటే కమిటీని నియమించారు. స్కూల్ అసిస్టెంట్‌ను నోడల్ అధికారిగా నియమించడంతో విమర్శలు వచ్చాయి. జూనియర్ టీచర్లు సీనియర్లను, గెజిటెడ్ హెచ్‌ఎంలను ఎలా ప్రశ్నిస్తారని.. ఉత్తర్వులను విరమించుకోవాలని డిమాండ్ చేయడంతో విద్యాశాఖ వెనక్కి తగ్గింది. ఈసారి వేర్వేరుగా కమిటీలను నియమించింది.
ఉపాధ్యాయులతోపాఠశాల పర్యవేక్షణ కమిటీలు
కలెక్టర్ నేతృత్వంలో బృందాల ఏర్పాటు
నెలాఖరు నుంచి తనిఖీలు
వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు