వందనం | - | Sakshi
Sakshi News home page

వందనం

Oct 20 2025 9:24 AM | Updated on Oct 20 2025 9:24 AM

వందనం

వందనం

ఇక్కడి నుంచే ప్రకటన ఉమ్మడి జిల్లా పరిధిలో.. ఎల్లప్పుడూ అండగా ఉంటాం..

వీరులారా..

ఉమ్మడి జిల్లాలో అమరులైన 39 మంది పోలీసులు

సమాజ రక్షణ కోసం

ప్రాణత్యాగం

బాధిత కుటుంబాలకు

అండగా పోలీస్‌ శాఖ

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు

రేపు పోలీస్‌ అమరవీరుల

సంస్మరణ దినోత్సవం

మహబూబ్‌నగర్‌

జిల్లాకేంద్రంలో

అమరవీరుల స్తూపం

శాంతిభద్రతల పరిరక్షణ కోసం నక్సలైట్ల కాల్పుల్లో మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం గతంలో ఎక్స్‌గ్రేషియా చెల్లించేది కాదు. అయితే 1997లో లక్ష్మాపూర్‌ ఘటనలో మృతి చెందిన వారిని పరామర్శించేందుకు అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో పోలీస్‌ కుటుంబాలు మంత్రి దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి రూ.1.50 లక్షలు అమరవీరుల కుటుంబ సభ్యులకు ఇచ్చేలా ఎస్పీకి అధికారం కల్పించగా.. ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంచారు. అలాగే ఒక ప్లాటు, రైల్వే ప్రయాణం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తున్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీస్‌ సిబ్బంది కుటుంబ సభ్యులకు మహబూబ్‌నగర్‌లోని హౌసింగ్‌బోర్డు కాలనీ సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు.

మహబూబ్‌నగర్‌ క్రైం/ కొల్లాపూర్‌: విధి నిర్వహణలో అసువులు బాసినవీరులు వారు.. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించే క్రమంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయని నిర్భయులు.. ఎక్కడ బాంబు పేలినా.. ఎక్కడ తుపాకులు గర్జించినా.. వెనకా ముందు చూడకుండా దూసుకుపోతారు.. శత్రువులతో జరిగే పోరాటంలో తుదిశ్వాస వరకు పోరాడుతారు. అలాంటి పోరాటాల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీస్‌ అమరవీరుల జ్ఞాపకాలు పదికాలాలపాటు పదిలంగా దాచే ప్రయత్నం చేస్తోంది పోలీస్‌ శాఖ. ఏటా ఒకరోజు వారిని స్మరించుకునే ఏర్పాట్లు చేసింది. కర్తవ్య నిర్వహణలో వెన్నుచూపని ఆ ధీరులను స్మరించుకోవడానికి ప్రతిఏటా అక్టోబర్‌ 21న పోలీస్‌ అమరవీరుల దినోత్సవం చేపడుతారు. ఈ క్రమంలోనే మంగళవారం పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

అమరవీరుల కుటుంబ సభ్యులను కేవలం అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజు కాకుండా ఎప్పుడు సమస్య వస్తే అప్పుడు ఆదుకోవడానికి శాఖ సిద్ధంగా ఉంటుంది. వారికి ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాల విషయంలో ఉన్న పెండింగ్‌ పనులు పూర్తిచేసి అందజేయడం జరిగింది. వారి కుటుంబ సమస్యలతోపాటు పిల్లల చదువులకు సంబంధించిన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. జిల్లాలో రెండు అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి.

– జానకి, ఎస్పీ, మహబూబ్‌నగర్‌

ఉమ్మడి పాలమూరులో మావోయిస్టుల తూటాలకు ఇప్పటి వరకు 39 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.

1990లో కోడేరు మండలం తుర్కదిన్నె వద్ద ఎమ్మెల్యే ఇంటిపై మావోయిస్టులు దాడి చేసిన ఘటనలో ప్రభాకర్‌ అనే కానిస్టేబుల్‌ బలయ్యాడు.

1991లో వంగూరు పోలీస్‌స్టేషన్‌పై దాడి చేయగా ఖాజాపాషా అనే కానిస్టేబుల్‌ మృతిచెందాడు. అదే ఏడాది కొల్లాపూర్‌లోని ఓ హోటల్‌లో ప్రభాకర్‌ అనే కానిస్టేబుల్‌ భోజనం చేస్తుండగా నక్సలైట్లు కాల్చి చంపారు.

1993లో కొల్లాపూర్‌ మండలం సోమశిల వద్ద అప్పటి మహబూబ్‌నగర్‌ ఎస్పీ పరదేశినాయుడు, సిబ్బందితో కలిసి బస్సులో వెళ్తున్న సమయంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ దుర్ఘటనలో ఎస్పీతోపాటు ఇద్దరు ఎస్‌ఐలు కిషోర్‌కుమార్‌, శివప్రసాద్‌, హెడ్‌కానిస్టేబుల్‌ రంగారెడ్డి, కానిస్టేబుళ్లు సుభాణ్‌, జహబ్‌ ఇక్బాల్‌, జయరాం, వైవీఎస్‌ ప్రసాద్‌ అక్కడికక్కడే మృతిచెందారు.

1994లో తలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌పై మావోయిస్టులు జరిపిన దాడులో ఫయోద్దీన్‌ అనే కానిస్టేబుల్‌ మృతిచెందాడు.

1996లో కొల్లాపూర్‌ మండలం కుడికిళ్లలో ఎన్నికల విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ మురళీధర్‌రెడ్డిని నక్సల్స్‌ కాల్చిచంపారు.

1997లో బల్మూర్‌లో పరీక్షల బందోబస్తు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌ నక్సల్స్‌ తూటాలకు బలయ్యాడు. అదే ఏడాదిలో అమ్రాబాద్‌ పరిధి లక్ష్మాపూర్‌ నుంచి ట్రాక్టర్‌లో వెళ్తున్న ఎస్‌ఐ మాల్సూర్‌, కానిస్టేబుళ్లు నాగేశ్వరుడు, జగదీశ్వర్‌రెడ్డి, మారెప్ప, శంకరయ్య మందుపాతరలకు బలయ్యారు. అదే ఏడాదిలో అమ్రాబాద్‌ వద్ద పోలీసులు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మహబూబ్‌ అలీఖాన్‌ అనే కానిస్టేబుల్‌ మరణించాడు.

1999లో వీపనగండ్ల వద్ద నక్సల్స్‌ పేల్చిన మందుపాతరకు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు ఆంజనేయులు, గోపాల్‌ బలయ్యారు.

2000 ఏడాదిలో కానిస్టేబుల్‌ హన్మనాయక్‌ను హతమార్చారు.

2001లో హోంగార్డు శ్రీనివాసరాజును అచ్చంపేట పరిధిలోని ఎదిరలో మావోయిస్టులు హతమార్చారు. అదే ఏడాదిలో ఆమనగల్‌ సమీపంలోని కాటన్‌మిల్లు వద్ద జరిగిన ప్రమాదాన్ని తెలుసుకునేందుకు వెళ్లిన ఎస్‌ఐ హన్మంతురెడ్డిని నక్సలైట్లు కాల్చిచంపారు.

2002లో మన్ననూర్‌ పండరీ అనే కానిస్టేబుల్‌ చంపేశారు.

2004లో కొల్లాపూర్‌ ఎమ్మెల్యే గన్‌మెన్‌గా ఉన్న హుమ్లానాయక్‌, వెంకట్‌రెడ్డిలను తుపాకీతో కాల్చిచంపారు. అదే ఏడాది అడ్డాకుల ఎంపీపీ కందూరు నారాయణ గన్‌మేన్‌ సుగుణాకర్‌ను కాల్చిచంపారు.

2005లో బాలానగర్‌ ఎస్‌ఐని హతమార్చేందుకు మావోయిస్టులు రెక్కీ నిర్వహించి.. చివరకు ప్రకాష్‌ అనే కానిస్టేబుల్‌ కాల్చారు. ఇదే ఏడాదిలో అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిల్చొని ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ లక్ష్మయ్య, కానిస్టేబుల్‌ శేఖర్‌నాయక్‌లను మావోయిస్టులు కాల్చిచంపారు.

నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి గన్‌మెన్‌ రాజారెడ్డి నక్సల్స్‌ తూటాలకు బలయ్యారు. అలాగే చిన్నచింతకుంట ఎస్‌ఐ అహ్మద్‌ మోహియుద్దీన్‌ను పోలీస్‌స్టేషన్‌ ఎదుటే పట్టపగలు కాల్చిచంపారు.

2006లో కొండనాగులలో జహంగీర్‌ అనే హెడ్‌కానిస్టేబుల్‌, అదే ఏడాది కూంబింగ్‌ నిర్వహిస్తున్న జోష్‌బాబు అనే గ్రేహౌండ్‌ కానిస్టేబుల్‌ను అత్యంత దారుణంగా హతమార్చారు. అదే ఏడాది కొల్లాపూర్‌ పరిధిలోని సింగోటం వద్ద రమేష్‌ అనే కానిస్టేబుల్‌ మావోల తూటాలకు బలయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement