
మార్వాడీలకు ప్రత్యేకం..
రాజస్థాన్ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా దీపావళి పండుగను నిర్వహించుకుంటాం. మా ముతాత్తలు 300 ఏళ్ల క్రితం నారాయణపేటకు వచ్చారు. ఇంటిల్లిపాది అందరం దీపావళి పండుగను ఆనందంగా జరుపుకొంటాం. లక్ష్మీనారాయణ భగవానుడికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటాం.
– మురళీ భట్టడ్, నారాయణపేట
రాజస్థాన్ మార్వాడీలకు దీపావళి పండుగ ఎంతో ప్రత్యేకం. దాదాపు 300 ఏళ్ల క్రితమే రాజస్థాన్ నుంచి మార్వాడీల కుటుంబాలు నారాయణపేటకు వ్యాపార నిమిత్తం వచ్చి స్థిరపడ్డారు. పిల్లల చదువులు, వ్యాపారాల నిమిత్తం కొంత మంది హైదరాబాద్‌లో సైతం ఉంటున్నారు. ప్రస్తుతం పట్టణంలో 100కి పైగా రాజస్థాన్ కుటుంబాలు ఉన్నాయి. వారు రాజస్థాన్ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టి పడేలా పండుగను ఇంటిల్లిపాది జరుపుకొంటారు. దీపావళిని ప్రతి కుటుంబం ఆనందోత్సవాల మధ్య ఐదు రోజుల పాటు నిర్వహించుకుంటారు. మొదటి రోజు ధందేరాసు నిర్వహిస్తారు. ఇంటిల్లిపాది లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. రెండో రోజు రూప్ చౌదాస్ వేడుకలు, సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత లక్ష్మీదేవి పూజలు నిర్వహించి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకొంటారు. నాలుగో రోజు గోవర్ధన్ పూజ (ఆవుపేడతో) నిర్వహిస్తారు. ఐదో రోజు బైదూజ్ వేడుకలు చేసుకుంటారు.
ప్రజల భద్రతే పోలీసుశాఖకు అత్యంత ప్రాధాన్యమని.. దీపావళి పర్వదినాన్ని బాధ్యతాయుతంగా జరుపుకోవాలని ఎస్పీ డా.వినీత్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. సురక్షితంగా, ప్రశాంత వాతావరణంలో ప్రమాదరహితంగా వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. ముఖ్యంగా లైసెన్స్ పొందిన దుకాణదారుల వద్దే బాణాసంచా కొనుగోలు చేయాలని సూచించారు. పిల్లలు పెద్దల సమక్షంలో మండే వస్తువులకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే పటాకులు కాల్చాలన్నారు. వెలగని క్రాకర్లను తిరిగి వెలిగించరాదన్నారు. జంతువులు లేదా మనుషుల వైపు పటాకులు విసరవద్దన్నారు. కర్టెన్లు, కాగితపు అలంకరణలు, విద్యుత్ వైర్లకు దూరంగా ఉంచాలన్నారు. వెలిగించిన దీపాలను గమనించకుండా వదిలి పెట్టరాదన్నారు. నాణ్యత కలిగిన విద్యుత్ లైట్లు మాత్రమే ఉపయోగించాలని.. సాకెట్లను ఓవర్‌లోడ్ చేయరాదని తెలిపారు. అత్యవసర సమయంలో డయల్ 100, 101, 112 లేదా పోలీస్ కంట్రోల్‌రూమ్ 87126 70399 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
బాణాసంచా కాల్చేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని 108 రాష్ట్ర అధికారి బి.సుధాకర్ సూచించారు. ధ్వని అధికంగా వచ్చే టపాసులు కల్చకపోవడం మంచిదని.. శరీరానికి వదులుగా ఉండే నూలు దుస్తులు, కాళ్లకు చెప్పులు, కంటి అద్దాలు మాస్కు ధరించాలని తెలిపారు. ఈ దీపావళికి అత్యవసర పరిస్థితులు 5శాతం నుంచి 10 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. కేవలం అగ్ని ప్రమాదాలే కాకుండా యాక్సిడెంట్లు, విద్యుత్ షాక్, గర్భిణులకు పురిటినొప్పులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో 108 బృందం రాష్ట్రవ్యాప్తంగా హాట్స్ స్పాట్ ప్రాంతాల్లో అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచి ఘటనా స్థలానికి వీలైనంత త్వరగా చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అత్యవసర సమయంలో 108 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.

మార్వాడీలకు ప్రత్యేకం..