
ప్రజా సంక్షేమమే లక్ష్యం
ధన్వాడ: రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. ధన్వాడ మండలం కిష్టాపూర్‌లో దళిత రైతులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన 23 బోరుమోటార్లను ఆమె ప్రారంభించి మాట్లాడారు. రూ. 418కోట్లతో చేపట్టనున్న కృష్ణా–వికారాబాద్ రైల్వేలైన్ నిర్మాణంతో నారాయణపేట ప్రజలకు రైలు సౌకర్యం అందుబాటులోకి రానుందన్నారు. ఈ పనులను త్వరలోనే ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు చెప్పారు. కొడంగల్–పేట ఎత్తిపోతల పథకంతో జిల్లా సస్యశ్యామలంగా మారుతుందన్నారు. జిల్లా రైతాంగానికి సాగునీటి వసతి కల్పించేందుకు భారీ ప్రాజెక్టును మంజూరుచేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జిల్లాలో ఏ ఒక్కరికీ కూడా డబుల్‌బెడ్రూం ఇల్లు, రేషన్ కార్డులు మంజూరు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలోనే సొంతిల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ముందుగానే బేస్‌మెంట్ నిర్మించుకున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామన్నారు. కాగా, కిష్టాపూర్‌లో దళిత రైతులకు రూ. 24,51,800 వ్యయంతో 23 బోర్లను డ్రిల్లింగ్ చేయించి.. విద్యుత్ బోరుమోటార్లను బిగించినట్లు తెలిపారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఏడీ ఖలీల్, ఎంపీడీఓ వెంకటేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ సిందూజ, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, జేఏసీ మాజీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరహరి, మాజీ సర్పంచ్ దామోదర్‌రెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, వెంకట్రాములు, రాఘవేందర్‌రెడ్డి, శివాజీ తదితరులు పాల్గొన్నారు.