
అమరుల త్యాగం స్ఫూర్తిదాయకం
● శాంతియుత సమాజం,శాంతిభద్రతలతోనే అభివృద్ధి సాధ్యం
● కలెక్టర్ సిక్తాపట్నాయక్
నారాయణపేట: సంఘ విద్రోహశక్తులతో పోరాడి మృతిచెందిన పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తోందని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం (పోలీస్ ఫ్లాగ్ డే)ను ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్తూపానికి కలెక్టర్‌తో పాటు ఎస్పీ డా. వినీత్, అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, పోలీస్ అధికారులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దేశ అంతర్గత భద్రత, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో పోలీస్ వ్యవస్థ కీలకంగా పని చేస్తోందన్నారు. మన రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందడానికి పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండటమేనని తెలిపారు. అమరులైన పోలీసు కుటుంబాలకు ఎలాంటి అవసరాలున్నా కలెక్టర్ కార్యాలయం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు.
పోలీసు యోధులను స్మరించుకుందాం..
విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు యోధుల త్యాగాలను స్మరించుకుందామని ఎస్పీ డా. వినీత్ తెలిపారు. ఎండ, వాన, పగలు, రాత్రి తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకొనే పండగల్ని సైతం త్యజిస్తారని.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడి వీర మరణం పొందిన పోలీసుల త్యాగానికి సానుభూతి, గౌరవం చూపించడం మనందరి బాధ్యతన్నారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరించుకుంటూ ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా ప్రభుత్వం పాటిస్తోందని చెప్పారు. పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటే అభివృద్ధి ప్రతి ఒక్కరికి చేరుతుందనే దానికి మన రాష్ట్రమే నిదర్శనమన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో 191 మంది పోలీసులు అమరులయ్యారని చెప్పారు. అనంతరం జిల్లా పోలీసులు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి వీర సావర్కర్ చౌరస్తా, సత్యనారాయణ చౌరస్తా మీదుగా తిరిగి జిల్లా పోలీస్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పరేడ్ కమాండర్ ఆర్‌ఐ నర్సింహ, సీఐలు శివశంకర్, రాంలాల్, రాజేందర్‌రెడ్డి, సైదులు, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, నరేష్, నవీద్, బాలరాజు, భాగ్యలక్ష్మిరెడ్డి, రమేష్, సునీత, అశోక్‌బాబు, ఆర్‌ఎస్‌ఐలు శివశంకర్, శిరీష, మద్దయ్య, శ్వేత, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది తదిరులు పాల్గొన్నారు.

అమరుల త్యాగం స్ఫూర్తిదాయకం