
పల్లి సాగు అంతంతే..
మరికల్: అధిక వర్షాల కారణంగా ఖరీఫ్ సాగు చేసి న రైతులకు నష్టాలే మిగిలాయి. వాటిని భర్తీ చేసేందుకు యాసంగిలో వేరుశనగ సాగుపై రైతులు దృష్టి సారించారు. కానీ ఇప్పటికీ వర్షాల జోరు ఇప్పటికీ తగ్గకపోవడంతో వేరుశనగ వేసేందుకు సైతం రైతులు వెనకాడుతున్నారు. ఇప్పటికే పది రోజులుగా జిల్లాలో అక్కడక్కడ వేరుశనగ విత్తనాలు వేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. జిల్లాలో మరికల్, ధన్వాడ, దామరగిద్ద, మక్తల్, మద్దూరు, కోస్గి, నర్వ మండలాల్లో ఏటవాలు భూములల్లో ఎక్కువగా సాగు చేయగా.. ఇతర మండలాల్లో ఓ మోస్తరుగా వేరుశనగ సాగవుతోంది. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి భూగర్భజలాలు పెరిగినా రైతులు వేరుశనగ పంటపై ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. కొందరు రైతులు వేరుశనగ పంటలకు అడవి పందుల బెడద అధికంగా ఉంటుందని, మొక్కజొన్న, పత్తి, ఆముదం పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.
తుంపర సేద్యంతో అధిక దిగుబడులు..
నీటి వనరులను బట్టి ఏటవాలు భూముల్లో నీటి తడులు ఇచ్చే సమయంలో పొలం కోతకు గురి కాకుండా తుంపర సేద్యంతో తడులు ఇస్తారు. ఇలా చేయడం వల్ల ఎకరాకు సరిపోయే నీటితో మూడు ఎకరాలు సాగు చేయొచ్చు. అంతే కాకుండా అధిక దిగుబడి వస్తుంది. ప్రధానంగా వానాకాలంలో పెస ర, జొన్న సాగు చేసిన భూముల్లో వేరుశనగ వేస్తా రు. మరికొన్ని భూములు ఏ పంట సాగు చేయకుండా దుక్కి దున్ని యాసంగిలో నేరుగా వేరుశనగ మాత్రమే సాగు చేస్తారు. అందువల్ల భూసారం కాపాడుకోవచ్చని రైతులు చెబుతున్నారు. దీంతో ఎకరాకు 30 నుంచి 40 బస్తాల దిగుబడి వస్తుందని, పెట్టుబడి పోనూ సుమారు రూ. 40 వేల వరకు చేతికి అందుతుండటంతో రైతులు యాసంగి వేరుశనగ సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
విత్తనాల కోసం ఇతర జిల్లాలకు
ఉమ్మడి జిల్లాలో నాణ్యమైన వేరుశనగ విత్తనాలు లభించకపోవడంతో కొందరు రైతులు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, తిరుపతికి వెళ్లి కే6, 1694 రకాల విత్తనాలకు క్వింటాల్‌కు రూ.12 వేల చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు రైతులు మహబూబ్‌నగర్, గుత్తి, మదనాపురం, రాయిచూర్ తదితర ప్రాంతాల నుండి విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేస్తున్నారు. వనపర్తి విత్తనోత్పత్తి సంస్థలో కే6, కదిరి లేపాక్షి–1812 రకాల విత్తనాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎకరానికి 65 కిలోల విత్తనాలు అవసరం ఉండటంతో పెద్ద రైతులు మంచి విత్తనాల కోసం ఇతర జిల్లాలకు పరుగులు తీస్తున్నారు.
కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి
వేరుశనగ రైతులు ప్రతి ఏడాది విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. విత్తనాలు కొనబోతే ధరలు ఆకాశన్నంటుతున్నాయి. అమ్మబోతే గిట్టుబాటు ధరలు లేక విలవిల్లాడే పరిస్థితి నెలకొంటుంది. జిల్లావ్యాప్తంగా వేరుశనగ విత్తనాలు కొనేందుకు వ్యాపారులను ఆశ్రయిస్తే డిమాండ్‌ను బట్టి ఆగస్టులో క్వింటాల్‌కు రూ.8 నుంచి రూ.9 వేల వరకు ఉండగా, సెప్టెంబర్‌లో రూ.9 నుంచి రూ.12 వేల పెంచారు. ప్రభుత్వం మాత్రం కేవలం 3 వేల ఎకరాలకు మాత్రమే విత్తనాలు పంపిణీ చేసింది. విత్తనాలు అందని రైతులు ఇతర జిల్లాలకు వెళ్లి అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. 2024 మార్చిలో రైతులు వేరుశనగను క్వింటాల్‌కు మార్కెట్‌లో రూ.4,100 నుంచి రూ. 7,600 వరకు విక్రయించారు.
జిల్లాలో 8 వేల ఎకరాలకు తగ్గే అవకాశం ఉందని అంచనా
3 వేల ఎకరాలకు విత్తనాలు పంపిణీ చేసిన అధికారులు
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జోరందుకున్న సాగు
వేధిస్తున్న అడవి పందుల బెడద
ప్రత్యామ్నాయంగా పత్తి, ఆముదం, మొక్కజొన్న సాగుకు ఆసక్తి
విత్తనాలు పంపిణీ చేశాం
జిల్లాలో 8 వేల ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేసే అవకాశం ఉంది. ఇందుకు గాను ప్రభుత్వం 3 వేల ఎకరాలకు సరిపడా విత్తనాన్ని అందించడంతో రైతులకు పంపిణీ చేశాం. ఇతర జిల్లాలో వేరుశనగ విత్తనాలు కొనుగోలు చేసే రైతులు నాణ్యమైన వాటిని ఎంచుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం.
– జాన్‌సుధాకర్,
జిల్లా వ్యవసాయధికారి, నారాయణపేట