
నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
● ఎస్పీ డా.వినీత్
నారాయణపేట: జిల్లాలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. పాత నేరస్తులు, రౌడీ షీటర్స్, అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచాలని ఎస్పీ డా.వినీత్ సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పోలీస్‌స్టేషన్ల వారీగా 5 ఏళ్ల కాలంలో జరిగిన నేరాలు, చోరీలు, ఇతర ఘటనలతో పాటు రోజు ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి.. ఎన్ని కేసులు నమోదు చేస్తున్నారనే వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై జాప్యం చేయకుండా కేసులు నమోదు చేయాలన్నారు. తదుపరి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. అదే విధంగా జిల్లాలో చోరీలు, ప్రాపర్టీ రికవరీ కేసులను త్వరగా ఛేదించాలన్నారు. కేసుల పెండింగ్ పూర్తిగా తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పరిధిలో రాత్రివేళ పెట్రోలింగ్ పెంచాలని.. పగటి వేళ పబ్లిక్ సంచరించే ప్రదేశాల్లో విసబుల్ పోలీసింగ్ చేయాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై చర్యలు చేపట్టాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ గ్రామాల్లో పర్యటిస్తూ తగిన సమాచారం సేకరించాలన్నారు. ఎస్‌ఐలు ప్రజలతో మమేకమవుతూ సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసే విధంగా మానిటరింగ్ చేయాలన్నారు. పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
● పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను జాప్యం లేకుండా త్వరగా పరిష్కరించాలని ఎస్పీ వినీత్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై నాలుగు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేశ్, ఆర్‌ఐ నర్సింహ, సీఐలు శివశంకర్, రాంలాల్, సైదులు, ఎస్‌ఐ లు వెంకటేశ్వర్లు, రాముడు, రాజు, విజయ్‌కుమార్, బాలరాజు, రాము, సురేశ్, నవీద్, అశోక్‌బాబు, సునీత, రమేశ్, గాయత్రి, మహేశ్వరి తదితరులు ఉన్నారు.
కలెక్టర్‌ను కలసిన ఎస్పీ
నారాయణపేట: జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డా.వినీత్ సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్పీకి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదే విధంగా శాఖాపరమైన అంశాలపై వారు చర్చించారు.