
కార్యకర్తల అభిప్రాయం మేరకే డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక
నారాయణపేట: పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఏఐసీసీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ నారాయణ్ స్వామి అన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికపై సోమవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్, పీసీసీ జనరల్ సెక్రటరీ ఉజ్మా షకీర్‌తో కలిసి ఆయన జిల్లా కేంద్రంలోని సీవీఆర్ భవన్‌లో బ్లాక్–1, మరికల్‌లో బ్లాక్–2 సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ పదవికి పోటీచేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మరికల్ మండలం తీలేర్‌కు చెందిన ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, నారాయణపేట మండలంలో యువజన కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు కోట్ల రవీందర్‌రెడ్డి, యూత్ పట్టణ అధ్యక్షుడు యూసుఫ్ తాజ్ దరఖాస్తు చేసుకోగా.. ఏఐసీసీ పరిశీలకుడు నారాయణ్ స్వామి ముఖ్య నాయకులతో స్వయంగా మాట్లాడి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా దామరగిద్ద, నారాయణపేట పట్టణం, మండలం, ధన్వాడ, మరికల్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, నాయకులు అభ్యర్థి కోట్ల రవీందర్‌రెడ్డిని డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక చేయాలని ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. అయితే మక్తల్ నియోజకవర్గంలోని మక్తల్, ఊట్కూర్, నర్వ, మాగనూర్, కృష్ణా మండలాల్లో మంగళవారం, కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి, కొత్తపల్లి, గుండుమాల్, మద్దూర్ మండలాల్లో బుధవారం జరిగే కార్యకర్తల సమావేశాల్లో ఇంకా ఎవరెవరు దరఖాస్తు చేసుకుంటారో, ఎవరి పేర్లను ప్రతిపాదిస్తారో వేచి చూడాల్సి ఉంది.