
భవిష్యత్‌కు భరోసా
పీయూలో చదువుకున్న పలువురు విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు
● స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొంది.. వివిధ స్థాయిల్లో కొలువులు
● ప్రైవేట్‌తోపాటు దేశ, విదేశాల్లోనూ పూర్వ విద్యార్థుల రాణింపు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నత విద్యకు కేంద్ర బిందువుగా మారిన పీయూ ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాలను నిలబెట్టేందుకు వరప్రదాయినిగా మారింది. ఇంటర్ తర్వాత చేరే ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్ మొదలుకొని.. డిగ్రీ తర్వాత పీజీ స్థాయి కోర్సులు చదివిన ఎంతో మంది విద్యార్థులు వివిధ స్థాయిల్లో ఉద్యోగాల్లో చేరి జీవితంలో ఉన్నతంగా రాణిస్తున్నారు. యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని వసతులు కల్పించడంతో విద్యార్థులు జీవితంలో స్థిరపడి ఇక్కడి నుంచి వెళ్తున్నారు. సాధారణంగా యూనివర్సిటీలో స్టడీ సర్కిల్ ద్వారా తరగతులు బోధించేందుకు అటు ప్రభుత్వం, ఇటు విద్యార్థి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా కేవలం యూనివర్సిటీ అధికారులు ప్రత్యేకంగా నిధులు కేటాయించి శిక్షణ ఇప్పిస్తున్నారు. దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయి.
పోటీ పరీక్షలకు సన్నద్ధం..
యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక లైబ్రరీ, అవసరమైన పుస్తకాలు ఎప్పటికప్పుడు అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. వీటితో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు అధికారులు ప్రత్యేక స్టడీ సర్కిల్ సైతం నిర్వహించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో కళాశాల తరగతులు లేని సమయంలో స్టడీ సర్కిల్ కొనసాగించారు. దీంతో గతేడాది వెలువడిన పలు పోటీ పరీక్షల ఫలితాల్లో చాలామంది పీయూ విద్యార్థులు ఉత్తీర్ణత పొంది ఉద్యోగాలు సాధించారు. 2018– 19 విద్యా సంవత్సరంలో 160 మంది స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ పొందితే 35 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. 2019– 20లో 143 మంది శిక్షణ పొందగా... 21 మంది ఉద్యోగాలు పొందారు. 2020– 21లో కోవిడ్ కారణంగా శిక్షణ జరగలేదు. ఇక 2021– 22లో 135 మంది శిక్షణ తీసుకుంటే 25 మంది, 2022– 23లో 197 మంది శిక్షణ తీసుకుంటే 107 మంది విద్యార్థులు కానిస్టేబుల్, డీఎస్సీ, గ్రూప్–4 వంటి ఉద్యోగాలు సాధించడం గమనార్హం. అలాగే పలు ప్రైవేట్ సంస్థలు, విదేశాల్లోనూ కొందరు ఉద్యోగాలు పొందారు.

భవిష్యత్‌కు భరోసా