
భూ భారతి అర్జీలు పెండింగ్‌లో ఉండొద్దు
నారాయణపేట: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించి.. భూ భారతి దరఖాస్తులు, నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సేకరణ, సాదాబైనామాలు, భారత్‌మాల ఆక్విటెన్స్, నిషేధిత భూముల జాబితా తదితర వివరాలను తెలుసుకున్నారు. ఆర్డీఓ కార్యాలయంలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రామచందర్ నాయక్ ఉన్నారు.
● బాల్యవివాహాలు లేని జిల్లాగా నారాయణపేటను మార్చాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బాల్యవివాహ ముక్త్ భారత్‌లో భాగంగా యాక్సెస్ టు జస్టిస్, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ భాగస్వామ్యంతో.. మహిళా, శిశు సంక్షేమశాఖ సమన్వయంతో విజన్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ రూపొందించిన ప్రచార బోర్డులను కలెక్టర్ ఆవిష్కరించారు.
ప్రజావాణికి 21 ఫిర్యాదులు..
అన్ని శాఖల అధికారులు ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో కలెక్టర్ నేరుగా మా ట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 21 ఫిర్యాదులు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ శ్రీను, డిప్యూటీ కలెక్టర్ శ్రీరాం ప్రణీత్, కలెక్టరేట్ ఏఓ జయసుధ, విజన్ ఎన్‌జీఓ సమన్వయకర్త రవికుమార్, జిల్లా ప్రాజెక్టు అసోసియేట్ నరేశ్, రమేశ్, స్వప్న పాల్గొన్నారు.