
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
● ఎంపీ డీకే అరుణ, కలెక్టర్ సిక్తా పట్నాయక్
● పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం ప్రారంభం
నారాయణపేట రూరల్: ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు డీకె అరుణ, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం, పప్పు ధాన్యాల మిషన్‌ను భారత ప్రధాని నరేంద్రమోదీగా వర్చువల్‌గా శనివారం ప్రారంభించారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నారాయణపేట మండలంలోని జాజాపూర్ రైతువేదికలో ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరు కాగా.. కలెక్టర్ సిక్తా పట్నాయక్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్, నోడల్ అధికారి సాయిబాబా, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకానికి దేశంలోని 100 జిల్లాలను ఎంచుకోగా అందులో నారాయణపేట స్థానం సంపాదించడం ఈ ప్రాంత అభివృద్ధికి శుభ పరిణామమన్నారు. రాష్ట్రంలో ఈ పథకం కింద నాలుగు జిల్లాలు ఎంపిక కాగా వాటిలో నారాయణపేట, నాగర్‌కర్నూల్, గద్వాల మూడు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. పథకం అమలు కోసం ప్రతి ఏటా రూ.960 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన వాటిని పరిష్కరించేందుకు మోదీ సర్కార్ 2025 కేంద్ర బడ్జెట్‌లో పీఎం ధన్ ధాన్య కృషి యోజన కింద 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించిందన్నారు. గ్రామీణాభివృద్ధి, సహకారం, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య, ఐసీఏఆర్, నీతి ఆయోగ్, నాబార్డ్ విభాగాలు రాష్ట్రాలు వాటి అనుబంధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతో సన్నిహిత సహకారంతో పనిచేస్తుందని తెలిపారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ఒక ప్రత్యేక జాయిన్ డైరెక్టర్‌ను నియమించిందని, వ్యవసాయ రంగంలోని 36 అంశాలకు సంబంధించి ఒక్కో అంశంపై ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించి కేంద్రానికి పంపిస్తారన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, బీజేపీ ముఖ్య నాయకులు నాగురావు నామాజీ, రతంగ్‌పాండురెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, వివిధ మోర్చాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.
సాగు ఉత్పాదకతను పెంచడం
కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం కింద నారాయణపేట ఎంపిక కావడం ఈ ప్రాంత అభివృద్ధికి నాంది అన్నారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, పంట వైవిధ్యీకరణ, పంటల పెరుగుదల, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, పంటకోత తర్వాత నిల్వ, విలువ జోడింపును పెంచడం, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం, దీర్ఘకాలిక, స్వల్పకాలిక క్రెడిట్‌ను సులభతరం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 2018–2019 నుంచి ఆస్పిరేషన్ బ్లాక్ కొనసాగుతోందని, 2021లో జిల్లాలోని నర్వ మండలం ఆ బ్లాక్ కింద ఎంపికై ందని, నీతి అయోగ్ ద్వారా రూ.2 కోట్ల నిధులు వచ్చాయని ఆమె తెలిపారు. వ్యవసాయ పరిశోధన, విద్య విభాగం, మత్స్య శాఖ, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ, సహకార మంత్రిత్వ శాఖ, జలవనరులు, నది అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ పథకం కింద పనిచేస్తాయన్నారు.