
చిరు వ్యాపారులకు చేయూత
కోస్గి: మున్సిపాలిటీల్లోని వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకంతో ముందుకు వచ్చింది. ప్రైవేట్‌గా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని వ్యాపారం చేసుకుంటున్న వీధి వ్యాపారులకు గతంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హామీ లేకుండా బ్యాంకుల ద్వారా పీఎం స్వనిధి పథకం అమలు చేసి వడ్డీలేని రుణాలు అందించింది. వ్యాపారులకు దశల వారీగా రుణాల పరిమితిని పెంచుతూ అమలు చేసిన పీఎం స్వనిధి పథకం నిలిచిపోయింది. ఈ పథకం స్థానంలో తాజాగా ‘లోక్ కల్యాణ్’ పేరుతో కొత్త పథకం అమలు చేయనుంది. గతంలో రుణాలు పొందని వీధి వ్యాపారులకు కొత్త పథకం ద్వారా రుణాలు మంజూరు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు మున్సిపాలిటీల్లో వీధి వ్యాపారులకు లోక్ కల్యాణ్ మేళాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. అక్టోబర్ 2లోగా ఆసక్తి ఉన్న చిరు వ్యాపారుల నుంచి మెప్మా సిబ్బంది దరఖాస్తులు స్వీకరించి రుణాల మంజూరు కోసం బ్యాంకర్లకు అందజేయనున్నారు.
నిలిచిన పీఎం స్వనిధి పథకం
ఐదేళ్ల క్రితం కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ విధించడంతో వీధి వ్యాపారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాము నమ్ముకున్న వ్యాపారాలు మూత పడటంతో వారి బతుకులు నడవడం కష్టతరమైంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారులకు ఆర్దిక చేయూత అందించేందుకు పీఎం స్వనిధి పథకాన్ని ప్రారంభించింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో వీధి వ్యాపారుల సర్వే నిర్వహించి అర్హులైన వారికి గుర్తింపు కార్డులను అందజేసింది. మొదటి విడతగా రూ.10 వేలు, రెండో విడత కింద రూ.20 వేలు బ్యాంకు రుణాలు అందించారు. రెండు విడతల్లో రుణం తీసుకొని సక్రమంగా చెల్లించిన వారికి మూడో విడతగా రూ.50 వేలు అందించారు. ఈ పథకం నిలిచిపోవడంతో ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న కొందరికి ఎలాంటి రుణాలు అందలేదు. దీనికితోడు వీధి వ్యాపారుల సంఖ్య పెరడగంతోపాటు రుణాల కోసం దరఖాస్తుదారులు సైతం పెరిగారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా వీధి వ్యాపారులకు ఆర్దిక చేయుతనివ్వడం కోసం లోక్ కళ్యాణ్ పేరుతో కొత్త పథకం అమల్లోకి తెచ్చింది.
కొత్త పథకంలో రుణ పరిమితి పెంపు
జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో అర్హులైన వీధి వ్యాపారులను గుర్తించి వారందరికి గుర్తింపు కార్డులు అందజేశారు. జిల్లాలో మద్దూర్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడటంతో అక్కడ వీధి వ్యాపారుల గుర్తింపు చేపట్టలేదు. మిగిలిన మూడు నారాయణపేట, కోస్గి, మక్తల్ మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 5,664 మంది వీధి వ్యాపారులు ఉన్నట్లు అధికారులు ప్రత్యేక సర్వే ద్వారా గుర్తించారు. అర్హులైన వ్యాపారులందరికి రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మెప్మా, బ్యాంకు అధికారులు మున్సిపాలిటీల వారిగా వ్యాపారులతో లోక్ కల్యాణ్ మేళాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. కొత్త పథకంలో మొదటి విడత రుణం రూ.15వేలు, రెండో విడతలో రూ.25 వేలు, మూడో విడతలో రూ.50 వేలు మంజూరు చేయనున్నారు. గతంలో పీఎం స్వనిధి పథకంలో రుణాలు తీసుకోని వ్యాపారులు, కొత్తగా నమోదైన వ్యాపారులు లోక్ కళ్యాణ్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మెప్మా అధికారులు సూచిస్తున్నారు.
పీఎం స్వనిధి స్థానంలో‘లోక్ కల్యాణ్’ రుణాలు
మున్సిపాలిటీల్లో అర్హులను గుర్తించే పనిలో అధికారులు
నూతన పథకంపై అవగాహన కల్పిస్తున్న వైనం
జిల్లాలో 5,664 మంది వీధి వ్యాపారులు

చిరు వ్యాపారులకు చేయూత

చిరు వ్యాపారులకు చేయూత

చిరు వ్యాపారులకు చేయూత