
వృద్ధులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమం, బాలసదనాన్ని బుధవారం సీనియర్ సివిల్ జడ్జి వింధ్యానాయక్ తనిఖీ చేశారు. వృద్ధుల ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధుల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వృద్ధులకి, చిన్నారులకు ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత అధికారికి వెంటనే తెలియజేయాలని, మెనూ ప్రకారం ఆహారం అందించాలన్నారు. అనంతరం బియ్యం, కూరగాయలు, వస్తువుల నాణ్యతను పరిశీలించారు. వృద్ధులకు అందించే మాత్రలకు సంబంధించి ఎప్పటికప్పుడు గడువు ముగిసిన తేదీలను చూడాలని, మూత్రశాలలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అనంతరం చిన్నారులతో మాట్లాడారు. వారికి పండ్లు అందజేశారు. వర్షాకాలం నేపథ్యంలో అన్ని సమయాల్లో చిన్నారులకు అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, సొంత వారిలా చూసుకోవాలని సూచించారు.