
అవగాహనతోనే మాదకద్రవ్యాల కట్టడి
నారాయణపేట: మాదకద్రవ్యాలతో కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించి, జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో మాదకద్రవ్యాల నిషేధం(యాంటీ నార్కోటిక్)పై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గంజాయి సాగు జరగకుండా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎవరైనా రైతు తన పొలంలో గంజాయి సాగు చేస్తున్నట్లు రుజువు అయితే అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ పరంగా లబ్ది చేకూరే సంక్షేమ పథకాలన్నీ రద్దు చేయడం జరుగుతుందన్నారు. అన్ని కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి, ఆయా కమిటీల నేతృత్వంలో మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. డీఎస్పీ నల్లపు లింగయ్య మాట్లాడుతూ.. మక్తల్, ఊట్కూర్ లో గంజాయి పట్టుకుని కేసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలో జరిగే ప్రతీ కార్యక్రమంలో మాదకద్రవ్య నిషేధ అంశాన్ని ఒక సబ్జెక్టుగా పెట్టుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఐఈఓ సుదర్శన్, వైద్య శాఖ అధికారి బిక్షపతి, అఖిల ప్రసన్న పాల్గొన్నారు.