
జీపీ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి
నారాయణపేట: గ్రామపంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉండడం వలన తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దసరా పండుగ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూడు నెలల పెండింగ్ వేతనాలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం దారుణమన్నారు. గత ప్రభుత్వం జారిచేసిన జీఓ నెం 51 వలన మల్టీ పర్పస్ విధానంతో కార్మికులు ప్రమాద బారిన పడుతున్నారన్నారు. మురికి కాలువ శుభ్రం చేసే కార్మికులతో కరెంటు స్తంభాలు ఎక్కి విద్యుత్ బల్బులు అమర్చే క్రమంలో కార్మికులు ప్రమాదానికి గురవుతున్నారన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికులకు ప్రభుత్వం ఎలాంటి ఇన్సూరెన్స్ కల్పించలేదని, రూ. 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడుకున్న వినతిపత్రం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ శ్రీను అందశారు. శివకుమార్, అశోక్, లక్ష్మణ్ బాలయ్య ,రాజు, హన్మంతు,తిప్పమ్మ, మరెమ్మ సంగమ్మ, సద్దాం నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.