
పాఠశాలల్లో పీటీఎం సమావేశాలు
● విద్యార్థుల తల్లిదండ్రులకుపలు సూచనలు
● నేటి నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు
నారాయణపేట రూరల్: దసరా సెలవుల నేపథ్యంలో శనివారం ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించారు. తల్లిదండ్రులు విధిగా సమావేశాలకు హాజరయ్యేలా ముందస్తు చర్యలు చేపట్టారు. పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారుల ఆదేశాల మేరకు ‘సంతోషకరమైన, సురక్షితమైన దసరా సెలవులు’ అంశంపై అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులతో సమావేశమై పలు సూచనలు చేశారు. జిల్లాలోని 337 ప్రాథమిక, 86 యూపీఎస్, 75 ఉన్నత పాఠశాలలు, 11 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, రెండు మోడల్ స్కూళ్లలో పీటీఎం సమావేశాలను విజయవంతంగా పూర్తిచేశారు. సమావేశాల నిర్వహణ తీరును ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు పర్యవేక్షించారు.
ప్రోత్సాహం అందించాలి..
పీటీఎం సమావేశాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు బాల్యంలో దసరా పండుగ ఎలా నిర్వహించుకున్నారు.. ఆ రోజుల్లో వారు చేసిన సాహసాలు, అనుభవాలను తెలుసుకున్నారు. బతుకమ్మ వేడుకల్లో పిల్లలను భాగస్వాములను చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. దసరా సెలవులను ఆనందంగా గడిపేలా ప్రోత్సహించాలని తెలిపారు. సెలవుల తర్వాత వచ్చే పరీక్షలకు కూడా సన్నద్ధమయ్యేలా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. ముఖ్యంగా చెరువులు, కుంటలు, వాగుల వద్దకు పిల్లలు ఒంటరిగా వెళ్లనివ్వొద్దని తెలిపారు. రోజుకో గంటపాటు చదివేలా చూడాలన్నారు. పర్యావరణహితంగా దసరా పండుగ నిర్వహించుకునేలా మార్గదర్శనం చేయాలని కోరారు. అదే విధంగా పిల్లల బేస్‌లైన్ పరీక్ష, నిర్మాణాత్మక పరీక్షలు, ప్రిమీడ్ లైన్ పరీక్షల ఫలితాలను తెలియజేశారు. ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. హాజరుశాతం తక్కువగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడి.. గైర్హాజరుతో కలిగే నష్టాలను వివరించారు.
విద్యార్థుల ఇంటిబాట
రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నుంచి పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల పాఠశాలల విద్యార్థులు దాదాపు 13 రోజులపాటు ఇంటి వద్దే ఉండనున్నారు. వచ్చే నెల 4వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో వసతిగృహాల్లో ఉండే చిన్నారులు శనివారం మధ్యాహ్నం నుంచే స్వగ్రామాలకు బయలుదేరారు.
పిల్లలను ఒంటరిగా వదలొద్దు..
జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పీటీఎం సమావేశాలు నిర్వహించి.. విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేశారు. సెలవుల సందర్భంగా సూచనలు అందించారు. ప్రభుత్వం విద్యాసంస్థలకు దసరా సెలవులు ఇచ్చినందున విద్యార్థులు ఇళ్ల వద్దే ఉంటారు. వారు రోజు గంటపాటు చదువుకునేలా చూడాలి. ఒంటరిగా పొలాలు, చెరువుల వద్దకు పంపరాదు. – గోవిందరాజు, డీఈఓ

పాఠశాలల్లో పీటీఎం సమావేశాలు

పాఠశాలల్లో పీటీఎం సమావేశాలు