
‘ప్రత్యేక బస్సుల పేరుతో చార్జీల పెంపు సరికాదు’
నారాయణపేట రూరల్: హిందూ పండుగలు, జాతరల సమయంలోనే ఆర్టీసీ ప్రత్యేక బస్సుల పేరుతో చార్జీలను పెంచి ప్రయాణికులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదని విశ్వహిందూ పరిషత్ జిల్లా ప్రధానకార్యదర్శి కన్న శివకుమార్ అన్నారు. ప్రత్యేక బస్సుల పేరుతో అదనపు చార్జీ వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం వీహెచ్‌సీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం డీఎం లావణ్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ, దసరా, దీపావళి ఇతర పండుగల సమయంలో చాలామంది ప్రయాణికులు స్వస్థలాలకు వస్తుంటారని.. అలాంటి సమయంలో ప్రత్యేక బస్సుల పేరుతో చార్జీలను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి పెంచిన బస్సు చార్జీలను ఉపసంహరించుకోవాలని.. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. నాయకులు రవికుమార్‌గౌడ్, ప్రవీణ్, వడ్ల శ్రావణ్, కృష్ణ, నర్సింహ, చక్రి, శివకుమార్, రవి, శ్రీను, వెంకటేశ్, ఆకాశ్ పాల్గొన్నారు.
తిలతైలాభిషేకం
బిజినేపల్లి: నందివడ్డెమాన్‌లోని జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరుడికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనిదోష నివారణ కోసం తిలతైలాభీషేక పూజలు నిర్వహించారు. ప్రతి శనివారం కొత్తగా వచ్చే భక్తుల కోసం ఆలయ సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశారస్త్‌రి తెలిపారు. అనంతరం భక్తులు బ్రహ్మసూత్ర పరమశివుడిని దర్శించుకోగా.. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.