
రైతులకు పింఛన్
ప్రీమియంకు సమానంగా..
ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు
ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకంతో అన్నదాతలకు పింఛన్
●
ప్రతి నెల చెల్లించేది
వయస్సు ప్రీమియం
(రూ.లో)
18–20 55
21–24 61
25–29 80
30–39 150
40 200
కోస్గి: వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్లు అందిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రైతుల కోసం పింఛన్ పథకం అమల్లోకి తెచ్చింది. ఏళ్ల తరబడి వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతులకు వృద్ధాప్యంలో ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన’ పథకం అమలు చేస్తూ అర్హులైన రైతులకు నెలనెల పింఛన్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఐదెకరాల లోపు..
కొత్త పింఛన్ పథకంలో నమోదు చేసుకోవడానికి 18 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉండి ఐదెకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులను అర్హులుగా నిర్ణయించారు. భూ రికార్డుల్లో భూమి పట్టాదారులుగా పేర్లు నమోదై ఉండి నిర్ణీత వయస్సు ఉన్న రైతులు కేంద్రం నిర్దేశించిన ప్రీమియం చెల్లించి పింఛన్ పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే నేషనల్ పెన్షన్ స్కీం(ఎన్‌పీఎస్), ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ఓ పరిధిలో ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. వ్యవసాయ భూములున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, ఆర్థికంగా ఉన్నవారు, సామాజిక భద్రత పథకాలు పొందుతున్న వారికి ఈ పింఛన్ పథకం వర్తించదు.
కోస్గి శివారులో వరినాట్లు వేస్తున్న
మహిళా కూలీలు(ఫైల్)
18 నుంచి 40 ఏళ్ల వయస్సున్న
రైతులు అర్హులు
నామమాత్రపు ప్రీమియంతో..
అవగాహన కల్పిస్తే ఎంతో మంది
రైతులకు ప్రయోజనం
జిల్లాలో 1.92 లక్షల మంది రైతులు
నూతన పథకానికి దరఖాస్తు చేసుకున్న రైతులు తమ వయస్సు ఆధారంగా రూ.55 నుంచి రూ.200 వరకు నామమాత్రపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతులు చెల్లించే ప్రీమియం మొత్తానికి కేంద్ర ప్రభుత్వం సమాన మొత్తంలో నిధులు జమ చేస్తుంది. రైతులు 60 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించాలి. 60 ఏళ్ల తర్వాత ప్రతినెల రూ. 3 వేల చొప్పున జీవితాంతం రైతుకు పింఛన్ అందుతుంది. రైతు మరణిస్తే అతడి భార్య లేదా నామినీకి ప్రతినెల రూ.1,500 అందజేస్తారు.
ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకానికి అన్ని రకాలుగా అర్హతలున్న రైతులు ఆన్‌లైన్ కేంద్రాలకు వెళ్లి పీఎం కిసాన్ కేఎంవై పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా రైతు పూర్తి వివరాలు, ఆధార్, నామినీ వివరాలు, రైతు సంతకంతో పాటు రైతు బ్యాంకు వివరాలు అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాగానే పింఛన్ కార్డు వస్తుంది. పథకంలో నమోదు చేసిన బ్యాంకు ఖాతా నుంచి నెలనెల పింఛన్‌కు సంబంధించిన ప్రీమియం డబ్బులు నేరుగా ఖాతా నుంచి తీసుకోబడతాయి.

రైతులకు పింఛన్