
పకడ్బందీగా ఓటరు జాబితా
నారాయణపేట: 2002, 2025 ఓటరు జాబితాల సరిపోల్చే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ సిక్తాపట్నాయక్ వివరించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు – కలెక్టర్లు, ఎన్నికల విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాల మధ్య విశ్లేషణ, మ్యాచింగ్, బ్యాచింగ్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా పరిశీలనను వ్యవస్థీకృతంగా నిర్వహించేందుకు కేటగిరీలుగా విభజించి నిర్దేశాలు ఇచ్చారు. ఈ నెల 24వ తేదీన నివేదికలు సమర్పించాలని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వారీగా నివేదికలు రూపొందించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. వీసీలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శీను, స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గాంగ్వర్, ఆర్డీఓ రామచంద్రనాయక్, తహసిల్దార్ అమరేంద్ర కృష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని అమలు చేయాలి
కోస్గి రూరల్: న్యాయవాదులపై దాడుల నేపథ్యంలో న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కోస్గి కోర్టు బార్ ఆసోసియేషన్ అధ్యక్షుడు గందె ఓంప్రకాష్ అన్నారు. దాడులకు నిరసనగా శుక్రవారం న్యాయవాద విధులను బహిష్కరించారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. నాంపల్లి కోర్టులో సిఓపి న్యాయవాదులు విధులు నిర్వహిస్తున్న అనిల్‌కుమార్, హనుమాన్‌నాయక్‌లపై దాడిని తీవ్రంగా ఖండించారు. న్యాయవాదులపై దాడి జరగడం అంటే న్యాయ వ్యవస్థ గౌరవాన్ని, కోర్టు అధికారంపై దారుణమైన సవాలుగా భావిస్తున్నామన్నారు. వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు విఎన్ గౌడ్, రాజలింగం, సంతోష్ , తాజ్‌ఖాన్, రాజురెడ్డి ,మురళి , మల్లేష్ , భీమేష్ పాల్గొన్నారు.
నూనె గింజల ఉత్పత్తి
పెంచడమే లక్ష్యం
కోస్గి రూరల్: నూనె గింజల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వదేశంలోనే ఉత్పత్తులను గణనీయంగా పెంచచడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల్లో ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని జిల్లా వ్యవసాయాధికారి జాన్‌సుధాకర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మార్కెట్‌యార్డు ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ అన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం కింద బంగినపల్లి రైతు ఉత్పత్తిదారుల సంఘంలోని రైతులకు మాత్రమే వంద శాతం సబ్సిడీపై వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంఘంలోని 800 మంది రైతులకు సంబంధించి 1000 ఎకరాలలో వేరుశనగ సాగు కోసం విత్తనాలు పంపిణీ చేశామన్నారు. జీజేజీ–32 రకం వేరుశనగ విత్తనాలు రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు అత్యంత అనువైనవని అన్నారు. వర్షాధార పంటలకు అనుకూలమని, పెద్ద గింజలతో కూడిన విత్తనాలని, ఎక్కడ నూనె శాతం, వ్యాధుల నిరోధకత ఎక్కువగా ఉంటుందన్నారు. దిగుమతులను తగ్గించి దేశీయంగా నూనె గింజలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.