
నిర్లక్ష్యం తగదు
విద్యారంగంపై
నారాయణపేట రూరల్: విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి సరికాదని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. స్థానిక గురుకుల పాఠశాలలో శుక్రవారం జిల్లా విద్యాశాఖ నిర్వహించిన టీఎల్‌ఎం మేళాకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ఉపాధ్యాయుల ప్రదర్శనలు తిలకించి రాష్ట్ర స్థాయికి ఎంపికై న ప్రాజెక్టు టీచర్లకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యాబోధన జరగాలంటే విద్యార్థులకు తగినట్లు ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండాలన్నారు. సరిపడా టీచర్లు లేక గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు సమీపంలోని పట్టణాలకు వెళ్లి ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సౌకర్యాలను, వసతులను కల్పించాలని డిమా ండ్ చేశారు. అన్ని రకాల గురుకుల పాఠశాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా సులువైన పద్ధతిలో బోధన చేపట్టాలని ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ అన్నారు. ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులుగా కొత్త విషయాలను నేర్చుకుంటూ తమ దగ్గర ఉన్న జ్ఞానాన్ని విద్యార్థులకు పంచాలన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
తెలుగు విభాగంలో అరుణ (మొగల్ మడ్కా), జాన్సీరాణి (కొత్తపల్లి), ఇంగ్లీష్ లో సంధ్య (సహనాపూర్), శ్రావణి (విఠలపూర్), గణితంలో వెంకటేష్ (పేరపళ్ళ), నరేష్ (గడిముంకంపల్లీ), ఈవీఎస్ విభాగంలో సత్యపాల్ (వల్లంపల్లి), లక్ష్మీదేవి (పోతిరెడ్డి పల్లి), ఉర్దూ మీడియంలో ఉస్మాన్ (ముద్రిఫా)లు ఎంపికయ్యారు. అనంతరం చిన్నారులు నిర్వహించిన సాంస్కృతి కార్య క్రమాలు అలరించాయి. డీఈఓ గోవిందరాజు, ఏఎంఓ విద్యాసాగర్, సీఎంఓ రాజేంద్ర కుమార్, డీఎస్‌ఓ భాను ప్రకాష్, సెక్టోరియల్ అధికారులు నాగార్జునరెడ్డి, యాదయ్యశెట్టి పాల్గొన్నారు.
ప్రోటోకాల్ రగడ
ఇదిలాఉండగా, జిల్లా స్థాయి టీఎల్‌ఎం మేళా ఆహ్వాన పత్రికలో ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఆమె పేరు రాయడంతో పాటు, కార్యక్రమానికి ఎంపీని పిలిచి ఎమ్మెల్యేను ఎందుకు ఆహ్వానించలేదంటూ పట్టణ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రోటోకాల్ ప్రకారం పలువురు ప్రజాప్రతినిధుల ఫొటోలను ఫ్లెక్సీలో ఏర్పాటుచేసి గ్రంథాలయ చైర్మన్ ను ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. ఈమేరకు స్టేజీపై ఏర్పాటుచేసిన ఫ్లెక్సీని తొలగించి, ఉపాధ్యాయులను హాల్ నుంచి బయటికి పంపి గేట్ కి తాళం వేశారు. డీఈఓకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. మధ్యాహ్నానికి అక్కడికి చేరుకున్న డీఈఓ గోవిందరాజు తో వాగ్వాదానికి దిగి, శాఖ తరపున జరిగిన తప్పిదానికి ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్పించారు. సలీం, వెంకటేష్, మల్లేష్ పాల్గొన్నారు.
మహిళల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం
ఊట్కూరు: మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బాగుంటుందని.. ఎంపీ డీకే అరుణ అన్నారు. స్వస్త్‌నారి–స్వశక్తిపరివార్ కార్యక్రమంలో భాగంగా పులిమామిడి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.