
గంగమ్మ ఒడికి గణనాథుడు
కోస్గి: శివాజీ చౌరస్తాలో శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ, హిందూ ఉత్సవసమితి, పలు హైందవ సంఘాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనం ఆదివారం నిర్వహించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ ప్రజలకు సందేశమిచ్చేలా వినాయకుడిని ఏటా ఏర్పాటుచేయడం ఆనవాయితి. ఈసారి స్వదేశీ వస్తువులు మాత్రమే వినియోగిద్దామంటూ మట్టి గణనాథుడిని ప్రతిష్టించారు. ఊరేగింపులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కళాకారుల నృత్యంతో పాటు బహుబలి, హనుమాన్, మహావతార్ నరసింహ, అఘోరా 2.0 ప్రదర్శనలతో ప్రత్యేకత చాటుకుంది. నిమజ్జన వేడుకను చూసేందుకు పట్టణ ప్రజలతో పాటు మండలంలోని పలు గ్రామాల ప్రజలు తరలివచ్చారు. పోలీసు బందోబస్తును సీఐ సైదులు పర్యవేక్షించారు. శోభాయాత్ర రూట్ మ్యాప్‌ను ఎస్‌ఐ బాలరాజుతో కలిసి పరిశీలించారు. దండం చెరువులో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.