అల్లంత దూరాన.. ఆశల వారధి | - | Sakshi
Sakshi News home page

అల్లంత దూరాన.. ఆశల వారధి

Sep 1 2025 6:22 AM | Updated on Sep 1 2025 6:22 AM

అల్లంత దూరాన.. ఆశల వారధి

అల్లంత దూరాన.. ఆశల వారధి

అచ్చంపేట: తెలంగాణ– ఆంధ్రప్రదేశ్‌లను కలిపే మద్దిమడుగు వంతెన నిర్మాణం ఎప్పుడెప్పుడా అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. నల్లమలలోని కృష్ణానదిపై వంతెన ఏర్పాటు దశాబ్దాలుగా పాలకులు చెబుతున్నా ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ ప్రాంతం నుంచి ఎన్నికై న ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతిసారి ఎన్నికల సందర్భంగా వంతెన ఏర్పాటుపై హామీలు ఇస్తున్నారే తప్ప నెరవేర్చలేకపోతున్నారు. పదర మండలం మద్దిమడుగు సమీపంలోని కృష్ణానదిపై వంతెన నిర్మిస్తే కోస్తాంధ్ర ప్రాంతాలకు చేరువవుతుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా మద్దిమడుగు (కసన్‌రేవు)– గుంటూరు జిల్లా రామచంద్రాపురం తండా మధ్య కిలోమీటరు వంతెన నిర్మాణం చేపడితే మాచర్లకు 145 కి.మీ., దూరభారం తగ్గుతోంది. ఇందుకు సుమారు రూ.250 కోట్లు ఖర్చు అవుతుంది. మద్దిమడుగు వద్ద కృష్ణానదిపై వంతెన, జాతీయ రహదారి నిర్మాణానికి సహకరిస్తూ ప్రత్యేక చొరవ తీసుకోవాలని గతేడాది ఆగస్టులో, ఈ ఏడాది జూలై 8న అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీశైలం జలాశయం క్రస్ట్‌ గేట్లు ఎత్తేందుకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో దీని ఆవశ్యకత గురించి మాట్లాడాలని గత నెలలో ఎంపీ మల్లురవికి విన్నవించారు.

తగ్గనున్న దూరభారం..

జాతీయ రహదారి–44 భూత్పూర్‌ నుంచి నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, మద్దిమడుగు మీదుగా కృష్ణానదికి అవతల ఏపీ 12 కి.మీ., దూరంలోని గుంటూరు జిల్లా చిరిగిరిపాడు (మాచర్ల) వరకు 165 కి.మీ., జాతీయ రహదారి, కృష్ణానదిపై వంతెన నిర్మాణం చేపట్టాలనే అంశం తెరపైకి వచ్చింది. 2017 నుంచి ఇప్పటి వరకు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ రహదారిని ప్రతిపాదిస్తూ కేంద్రానికి పంపించారు. అమ్రాబాద్‌, పదర మండలాల్లోని మద్దిమడుగు, ఇప్పలపల్లి, మారడుగు, ఉడిమిళ్ల, చిట్లంకుంట, వంకేశ్వరం, పదర తదితర గ్రామాల ప్రజలకు గుంటూరు, ప్రకాశం జిల్లాలతో సంబంధాలున్నాయి. చాలా ఏళ్ల కిందట ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారు ఇక్కడ స్థిరపడ్డారు. అచ్చంపేట, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల మధ్య కృష్ణానది ప్రవహిస్తుండటంతో అచ్చంపేట, దేవరకొండ, కొండమల్లెపల్లి, నాగార్జునసాగర్‌ మీదుగా మాచర్ల 193 కి.మీ., ప్రయాణించాల్సి ఉంది. మద్దిమడుగు సమీపంలో వంతెన నిర్మాణం చేపడితే మాచర్ల 48 కి.మీ., దూరం మాత్రమే ఉంటుంది. ఫలితంగా 145 కి.మీ., దూరభారం తగ్గడంతోపాటు కోస్తా– తెలంగాణ ప్రాంతాల మధ్య వ్యాపార సంబంధాలు మెరుగుపడుతాయి. విజయవాడ, గుంటూరు జిల్లాల మధ్య ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి ఏర్పాటు కావడంతో ఈ వంతెన ఏర్పాటుతో తెలంగాణ ప్రాంతం రాజధానికి అతి సమీపంలో ఉండటం, మాచర్ల, కారంపూడి, దాచేపల్లి, గురజాల, దుర్గి, గుంటూరు, విజయవాడ, అమరావతి ప్రాంతాల నుంచి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌ వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది.

ప్రమాదకర ప్రయాణం..

పదర మండలం మద్దిమడుగు నుంచి కృష్ణానది వరకు బండ్ల మార్గం మాత్రమే ఉంది. మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు ఏపీ ప్రజలతోపాటు తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, కోదాడ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌ ప్రాంతాల ప్ర జలు వస్తుంటారు. మాచర్ల, మద్దిమడు గు, ఇప్పలపల్లి, మారడుగు గ్రామాల ప్ర జలు కాలి నడకన కృష్ణానది వరకు చేరుకొని అక్కడి నుంచి బుట్టల ద్వారా అవ తలి ఒడ్డుకు చేరుకుంటారు. నిత్యం పశువుల వ్యాపారులు గొర్రెలు, పశువులను ప్రైవేట్‌ లాంచీల సాయంతో కృష్ణానదిలో ప్రమాదకరంగా దాటిస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రజలకు అవసరమై రోడ్డును ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. 2006లో మద్దిమడుగు నుంచి ప్రకాశం జిల్లాలోని కృష్ణానది ఒడ్డున ఉన్న అలాటంపెంట వరకు రోడ్డు నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రూ.3.20 కోట్లు మంజూరు చేసింది. అప్పట్లో పర్యావరణ, అటవీశాఖ అనుమతి లభించకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుంటే ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని వంతెన, రోడ్డు నిర్మాణం ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

ఎన్నికల హామీగా మారిన కృష్ణానదిపై వంతెన నిర్మాణం

మూడు దశాబ్దాలకుపైగా తప్పని ఎదురుచూపులు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తగ్గనున్న 145 కి.మీ., దూరభారం

అందుబాటులోకి వస్తే

వ్యాపారాలు, అభివృద్ధికి దోహదం

జాతీయ రహదారి ఏర్పాటుతోనైనా మోక్షం కలిగేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement