పాలమూరు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్.రామచందర్‌రావు నియామకం అయిన తర్వాత తొలిసారిగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. శని, ఆదివారాల్లో నియోజకవర్గాల్లో పర్యటించి జిల్లాస్థాయి నేతలతో పాటు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించనున్నారు. తొలిసారిగా ఉమ్మడి జిల్లాకు వస్తున్న క్రమంలో ఆయా జిల్లాలో పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట రామచందర్‌రావు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జడ్చర్లకు చేరుకుంటారు. అక్కడ పాలమూరు బీజేపీ శాఖ, బీజేపీ శ్రేణులు స్వాగతం పలుకుతారు. తర్వాత మహబూబ్‌నగర్‌లోని అప్పన్నపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి.. అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీతో అన్నపూర్ణ గార్డెన్‌కు చేరుకుంటారు. అక్కడ జిల్లా, నియోజకవర్గ, మండల, బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నారాయణపేట జిల్లా మరికల్, నారాయణపేటకు వెళ్లి.. వివిధ వర్గాల నాయకులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. రాత్రికి గద్వాల జిల్లాకేంద్రానికి చేరుకుని అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రెస్‌మీట్, ఆ తర్వాత మేధావులు, వివిధ వర్గాల నేతలతో సమావేశం నిర్వహించి.. 10 గంటలకు పెబ్బేరు, ఆ తర్వాత వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రాల్లో కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు.
ఉమ్మడి జిల్లాలో 2 రోజుల పాటుకార్యక్రమాలు
భారీ ఏర్పాట్లు చేస్తున్న పార్టీ శ్రేణులు