
రైతులకు నష్టపరిహారం చెక్కుల అందజేత
నారాయణపేట: జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం శివకుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన 36 మంది రైతులకు నష్ట పరిహారం చెక్కులను ఆర్డీఓ రామచంద్రనాయక్‌తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు దేశంలో ఎక్కడా ఇంత తక్కువ సమయంలో నష్టపరిహారం అందించలేదని, సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వేగంగా నష్టపరిహారం అందిస్తుందని కొనియాడారు. ప్రస్తుతం రైతులకు ఇస్తున్న పరిహారాన్ని పెంచి ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి విన్నవిస్తానని హామీనిచ్చారు. ఆర్డీఓ రామచంద్రనాయక్ మాట్లాడుతూ.. ఎత్తిపోతల పథకంలో భూములు, ఇతర ఆస్తులు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ నష్టపరిహారం అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. భూములు అందించిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. దామరగిద్ద మండలంలోని బాపన్‌పల్లికి చెందిన 21 మంది రైతులకు రూ.59.99 లక్షలు, నారాయణపేట మండలంలోని జాజాపూర్ గ్రామానికి చెందిన 15 మంది రైతులకు రూ.52.15 లక్షల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, ఆర్డీఓ కార్యాలయ ఏఓ అనిల్‌కుమార్, తహసీల్దార్లు తిరుపతయ్య, వెంకటేష్, సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్, డీటీ బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.