
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
నారాయణపేట: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం అవుతుందని జిల్లా జడ్జి బోయ శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన న్యాయవాదుల సమావేశంలో జడ్జి మాట్లాడుతూ.. రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘దేశం కోసం, 90 రోజుల మధ్యవర్తిత్వ ప్రచారం’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివాహ వివాదాలు, ప్రమాద దావా, గృహ హింస, చెక్‌బౌన్స్, వాణిజ్య వివాదాలు, సర్వీస్ విషయాలు, క్రిమినల్ కాంపౌండబుల్, వినియోగదారుల వివాదాలు, రుణ రికవరీ, విభజన, తొలగింపు, భూసేకరణ, ఇతర సివిల్ కేసులు పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక అవకాశమని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నారాయణపేట జిల్లాలోని అన్ని కోర్టుల్లో కలిపి 2,178 కేసులను త్వరగా పరిష్కరించాలని న్యాయమూర్తులను ఆదేశించారు. అనంతరం కోర్టు కేసుల్లో మీడియేషన్‌పై న్యాయమూర్తులు, న్యాయవాదులకు/మధ్యవర్తులకు శిక్షణ ఇచ్చారు. సెక్షన్ 89 సివిల్ ప్రొసీజర్ కోడ్ నిబంధనల ప్రకారం, పార్టీలు మధ్యవర్తుల సహాయంతో రాజీకి వచ్చే వారి కేసులను పరిష్కరించుకోవచ్చు అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన లాయర్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్ధ ఆదేశాల అనుగుణంగా కోర్టు కేసుల్లో మీడియేషన్‌పై ప్రజలకు, కక్షిదారులకు అవగాహన కల్పించారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి వింధ్యనాయక్, జూనియర్ సివిల్ జడ్జి సాయిమనోజ్, న్యాయవాదులు పాల్గొన్నారు.