
టెండర్లలో జాప్యమేనా?
నారాయణపేట: రాష్ట్రంలోని మత్స్యకారులు జీవనోపాధి కోసం వంద శాతం రాయితీపై చేప పిల్లల పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నా.. మరో వైపు చేప పిల్లలను వదిలే వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్, మే నెలల్లోనే టెండర్ల ప్రక్రియ మొదలై జులై నుంచి సెప్టెంబర్ వరకు జలాశయాలు, చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని బట్టి చేప పిల్లలు వదిలేవారు. కానీ ఇప్పటి వరకు టెండర్ల నోటిఫికేషన్‌పై అధికారిక ఉత్తర్వులు జారీ కాకపోవడంతో మత్స్యకారులు ఆందోళనలో ఉన్నారు.
11,039 మందికి జీవనపాధి
చెరువుల్లో చేప పిల్లలను వదిలితే జిల్లాలో 146 మత్స్యపారిశ్రామిక సంఘాల్లోని 11,039 సభ్యులకు జీవనోపాధి కలుగుతుంది. అందులో 141 మత్స్య పారిశ్రామిక సహాకార సంఘాలలో 10,058 మంది సభ్యులు, 11 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 692 మంది మహిళా సభ్యులు ఉన్నారు. జిల్లాలో 2 రిజర్వాయర్లు, 641 చెరువులు, కుంటలు ఉన్నాయి. చెరువుల్లో 35 నుంచి 40 ఎంఎం చేపపిల్లలు 1.02 కోట్లు, 80 నుంచి 100 ఎంఎం చేప పిల్లలను 80 లక్షలు పంపిణీ చేయాల్సి ఉంది.
గతేడాది నాలుగు సార్లు టెండర్లు
గతేడాది జులై 8న కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు అందించి తొలిసారి టెండర్లకు పిలుపినిచ్చింది. వ్యాపారస్తులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆగస్టు 2 వరకు పొడిగించారు. రెండు, మూడో సారి అవకాశం ఇస్తూ ఆగస్టు 13వరకు టెండర్లకు ఆహ్వానించినా ఒక్క టెండర్ దాఖలు కాలేదు. నాలుగోసారి టెండర్లు వేసేందుకు అవకాశం కల్పిస్తూ సెప్టెంబర్ 9 నుంచి 19 వరకు పొడిగించి పూర్తి చేసింది.
కమిటీ పర్యవేక్షణలోనే..
కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశా నిర్దేశంతో జిల్లా మత్స్యశాఖ అధికార యంత్రాంగం చేప పిల్లలను పంపిణీ చేసే టెండర్ల ప్రక్రియ కొనసాగనుంది. అయితే కలెక్టర్ ఆదేశాల మేరకు టెండర్ల కమిటీ చైర్మన్‌గా అడిషనల్ కలెక్టర్, సభ్యుడు కం కన్వీనర్‌గా జిల్లా మత్య్సశాఖ అధికారి, సభ్యులుగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, ఈడీఎం, ఇరిగేషన్ ఈఈలు ఉంటారు.
చెరువులకు జలకళ
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లా వ్యాప్తంగా 764 చెరువులకు జల కళ సంతరించుకుంది. చెరువుల్లో నీరు చేరుతుండడంతో కుంటలు, వాగులు పారుతున్నాయి. ఇప్పటిఏ జూరాల డ్యాం, భూత్పూర్, సంగంబండి రిజర్వాయర్లు నిండి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కానీ చేప పిల్లల పంపిణీపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు.
చేప పిల్లల పంపిణీకి నోటిఫికేషన్ జారీ చేయని ప్రభుత్వం
641 చెరువుల్లో 1.82 కోట్ల చేపపిల్లల పంపిణీ లక్ష్యం
జిల్లాలో 146 మత్స్యపారిశ్రామికసంఘాలు
పాత బకాయిలు చెల్లించకపోవడంతో ఆసక్తి చూపని వ్యాపారులు
ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వని అధికారులు