
లక్ష్యం మేర మొక్కలు నాటాలి
నారాయణపేట: వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే లక్ష్యాన్ని శాఖల వారీగా నిర్దేశించినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మంగళవారం అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ, సీఎస్ కె.రామకృష్ణారావు కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వీఐపీలు మొక్కలు నాటేందుకు 21 ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే విధంగా జిల్లాలో ఆయిల్‌పాం తోటల సాగుపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు తోటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ తెలిపారు. వానాకాలం సాగు నేపథ్యంలో ఎరువులు, విత్తనాల దుకాణాలను నిత్యం తనిఖీలు చేస్తున్నామన్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. వీసీలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డీఏఓ జాన్ సుధాకర్, డీఆర్డీఓ మొగులప్ప, హౌసింగ్ పీడీ శంకర్, జిల్లా వైద్యాధికారి జయచంద్రమోహన్ తదితరులు ఉన్నారు.