
ప్రత్యేక అవసరాలు గల పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ
నారాయణపేట రూరల్: ప్రత్యేక అవసరాలు గల చిన్నారులపై తల్లిదండ్రులతో పాటు భవిత కేంద్రం నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా ఐఈ కోఆర్డినేటర్ రాజేంద్రకుమార్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారులకు ఏర్పాటుచేసిన ఫిజియోథెరపి శిబిరాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. భవిత కేంద్రంలో ప్రతి సోమ, బుధవారం దివ్యాంగ చిన్నారులకు నిర్వహించే ఫిజియోథెరపి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రీతి, ఐఈఆర్పీ శ్రీనివాస్, ఎంఐఎస్ కరిష్మా, కంప్యూటర్ ఆపరేటర్ నారాయణ, సీఆర్పీ ఆరిఫ్ అహ్మద్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచండి
దామరగిద్ద: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ అన్నారు. దామరగిద్దలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను సోమవారం హౌసింగ్ పీడీ శంకరయ్యతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల వివరాలు, ఇళ్ల నిర్మాణ దశలు, మంజూరైన బిల్లుల వివరాలను తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 5,223 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, దాదాపుగా నిర్మాణ దశలో ఉన్నాయని.. 153 మందికి రూ. లక్ష చొప్పున బిల్లులు మంజూరైనట్లు అధికారులు వివరించారు. ట్రెయినీ కలెక్టర్ వెంట హౌసింగ్ సిబ్బంది కాకర్ల భీమయ్య ఉన్నారు.
బాలకేంద్రంలో అడ్మిషన్లు
నారాయణపేట రూరల్: పట్టణంలోని బాలకేంద్రంలో 2025–26 సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు సూపరింటెండెంట్ మహిపాల్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5–16 ఏళ్ల విద్యార్థినీ విద్యార్థులకు సితార్, తబలా, గాత్రం, నృత్యంతో పాటు మరిన్ని కళల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రోజు సాయంత్రం 5నుంచి 7గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.20, ఓసీ, బీసీలు రూ.50 అడ్మిషన్ ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

ప్రత్యేక అవసరాలు గల పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ