
ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు
నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 28 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌కు వన్నివిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పకప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 11 అర్జీలు
జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణిలో మొత్తం 11 అర్జీలు అందాయి. ఎస్పీ యోగేష్ గౌతమ్ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్‌లో మాట్లాడి వెంటనే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. జిల్లా పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని పోలీసులు ప్రజల మన్ననలు పొందే విధంగా విధులు నిర్వర్తించి వారికి సరైన న్యాయం అందించి భరోసా భద్రత కల్పించాలని తెలిపారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు.