
అంధ విద్యార్థులకు ప్రవేశాలు
నారాయణపేట: తెలంగాణ రాష్ట్ర వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్స్ సాధికారితశాఖ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో కొనసాగుతున్న ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాల/కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికిగాను 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రవేశాలు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ రాములు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 ఏళ్ల నుంచి 14 ఏళ్లలోపు వయస్సు ఉండి 40 శాతం అంధత్వం కలిగిన ధ్రువపత్రాలున్న విద్యార్థులు అర్హులని.. వారి వారి వయసు ఆధారంగా పాఠశాల, కళాశాలలో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచిత వసతి, ఒక్కొక్కరికి నాలుగు జతల దుస్తులతో పాటు అన్ని వసతులు సమకూరుస్తామని చెప్పారు. మహబూబ్‌నగర్ పిల్లలమర్రి రోడ్‌లో ఉన్న అంధుల ఆశ్రమ పాఠశాల/కళాశాలలో స్వయంగా సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్లు 96182 43794 సంప్రదించాలని సూచించారు.
స్లాట్ బుకింగ్‌తోనే
ప్లాట్ల రిజిస్ట్రేషన్
నారాయణపేట: రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 12 నుంచి స్లాట్ బుకింగ్ విధానంలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తామని సబ్ రిజిస్ట్రార్ రాంజీ తెలిపారు. శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సిబ్బందితో కలిసి ఇందుకు సంబంధించిన బ్యానర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతిరోజు 48 స్లాట్ల బుకింగ్ ఉంటుందని.. registration.telangana.gov.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుకింగ్ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్లు కృష్ణయ్యగౌడ్, పవన్‌కుమార్‌రెడ్డి, ఆపరేటర్ విజయ్‌కుమార్, సిబ్బంది, డాక్యుమెంటర్ రైటర్లు పాల్గొన్నారు.
పంట మార్పిడితో
అధిక దిగుబడులు
మద్దూరు: పంట మార్పిడితో అధిక దిగుబడులు పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై నేల ఆరోగ్యం, సాగునీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పంటమార్పిడి, అంతర పంటలు, మొక్కల పెంపకం, సాగులో మెళకువల గురించి రైతులకు అవగాహన కల్పించారు. పచ్చి రొట్ట ఎరువులు, వర్మీ కంపోస్ట్ తయారీ, వినియోగం గురించి శాస్త్రవేత్తలు వివరించారు. భూసార పరీక్షల ప్రాముఖ్యత, సరైన విధానంలో ఎరువుల వాడకం, విత్తనాలు, ఎరువుల ఎంపిక గురించి తెలియజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు నర్సింహులు, ఏఓ రామకృష్ణ, ఉద్యాన అధికారి హర్షవర్ధన్, పశు వైద్యాధికారి డా. సబిత, ఏఈఓలు శ్రావణ్, శ్వేత, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
జొన్న క్వింటా రూ.3,525
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో శుక్రవారం జొన్నలు క్వింటా రూ.3,525 ధర పలికాయి. అలాగే వరి ధాన్యం (హంస) గరిష్టంగా రూ.1,826, కనిష్టంగా రూ.1,550, సోనా రకం రూ.2,155– రూ.1,439, పెసర రూ.5,212, ఎర్ర కంది రూ.4,209 ధరలు లభించాయి.
ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం
క్వింటా రూ.2,127
దేవరకద్ర: స్థానిక మార్కెట్ యార్డులో శుక్రవారం జరిగిన టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,127, కనిష్టంగా రూ.1,719 నమోదయ్యాయి. హంస ధాన్యం ధర గరిష్టంగా రూ.1,815, కనిష్టంగా రూ.1,601గా ధరలు లభించాయి. మార్కెట్‌కు దాదాపు వేయి బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. నారాయణపేట మార్కెట్‌లో జొన్నలు క్వింటాల్‌కు రూ.3,525, ధాన్యం హంసరకం గరిష్టంగా రూ.1,826, కనిష్టంగా రూ.1,550, పెసర రూ.5,212, వడ్లు సోనా గరిష్టంగా రూ.2,155, కనిష్టంగా రూ.1,439, ఎర్ర కందులు రూ.4,209 పలికాయి.

అంధ విద్యార్థులకు ప్రవేశాలు