
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
నారాయణపేట: దేశ వ్యాప్తంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి , సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎమ్) రాష్ట్ర కన్వీనర్ టి సాగర్ పిలుపునిచ్చారు. జిల్లాలోని సీఐటీయూ కార్యాలయంలో గురువారం జరిగిన కార్మిక,కర్షక సదస్సులో వారు మాట్లాడారు. మే 8 నుంచి 15 వరకు జీపుజాతాలు, మోటార్ సైకిల్ ర్యాలీలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు నిర్వహించాలని, మే 16 నుంచి 19 సదస్సులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలన్నారు. కార్మికులు స్వాతంత్య్రం పూర్వం నుంచి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను వమ్ము చేస్తూ కార్పొరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా 5 కార్మిక కోడ్‌లు రూపొందించబడినవని, కార్మికులకు 45వ లేబర్ సదస్సు సిఫారస్ మేరకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. గతంలో రైతాంగానికి రాత పూర్వకంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కించి కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సూచించినట్లు సమగ్ర ఉత్పత్తి ఖర్చు (సి2)కు 50 శాతం కలిపి మద్దతు ధరను నిర్ణయించాలని, ఇది రైతులకు చట్టపరంగా దొరకాలని, దీని కి అనుగుణంగా వ్యవసాయోత్పత్తుల సేకరణ కొనసాగాలని డిమాండ్ చేశారు. రైతుల రుణాలన్ని మాఫీ చేసి రుణ విమోచన చట్టం చేయాలని, ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పథకాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా మార్చాలని, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని విద్యార్థి, యువజన, మహిళ, ఆదివాసి, గిరిజన, మైనార్టీ, సామాజిక సంఘాలతో పాటు మేధావులు, విద్యావంతులు, రాజకీయ పార్టీలు ఈ సమ్మె గ్రామీణ బందుకు సంపూర్ణ మద్దతును తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక, కర్ష క సంఘం నాయకులు వెంకట్రామిరెడ్డి, బాల్‌రాం,గోపాల్, అశోక్, అంజిలయ్యగౌడ్ పాల్గొన్నారు.