బాబూ.. మహిళలంటే గౌరవం లేదా? | - | Sakshi
Sakshi News home page

బాబూ.. మహిళలంటే గౌరవం లేదా?

Apr 28 2026 8:05 AM | Updated on Apr 28 2026 8:05 AM

ఏబీఎన్‌ రాధాకృష్ణ వ్యాఖ్యలను

ఎందుకు ఖండించ లేదు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు

కాటసాని రాంభూపాల్‌రెడ్డి

బొమ్మలసత్రం: రాష్ట్రంలో మహిళల గురించి ఏబీఎన్‌ రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేసినా సీఎం చంద్రబాబు ఖండించలేదంటే ఆయనకు మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేదని విషయం స్పష్టమవుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సునీల్‌ షెరాన్‌ను కాటసానితో పాటు మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పీపీ మధుసూదన్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ శశికళారెడ్డి, జిల్లా కార్యదర్శి సోమశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్‌ దాల్‌మిల్‌ అమీర్‌, పార్టీ లీగల్‌ సెల్‌ ఎం. ప్రతాప్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాబున్నిసా, ఎస్‌ఈసీ మెంబర్‌ గోపవరం సాయినాథరెడ్డి కలిశారు. ఈనెల 9న ఏబీఎన్‌ రాధాకృష్ణ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీస్టేషన్లలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు కనీస భద్రత, గౌరవం లభించటం లేదన్నారు. చంద్రబాబు ఇసుక ఫ్రీ అని చెప్పడంతో ప్రజలు వాహనంతో ఇసుక తెస్తుంటే పోలీసులు కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్‌ చేస్తున్నారన్నారు. ప్రజలకు ఇసుక ఫ్రీ అయినప్పుడూ ప్రతి ప్రాంతంలో టీడీపీ నేతలకు డంప్‌ యార్డులు ఎలా ఏర్పాటు చేయిస్తారో చంద్రబాబే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు నాయుడు అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్న విషయం అందరూ గమనిస్తున్నారని త్వరలో గట్టిగా బుద్ధి చెబుతారన్నారు.

రాధాకృష్ణా.. మీ వంశంలో

ఆ సంప్రదాయం ఉందా?

‘ఏబీఎన్‌ రాధాకృష్ణ .. భార్యలను చెల్లెల్లుగా భావించి వివాహం చేసే సంప్రదాయం మీ వంశంలో ఉందా..’ అని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంప్రదాయం లేదని, కొత్తగా ఆయన కనిపెట్టిన పద్ధతిలో 2029 తర్వాత ఘనంగా వివాహం జరిపిస్తామన్నారు. రాష్ట్రంలో యూరియా, డీజిల్‌ కొరత ఉందని, పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని, వాటిపై కథనాలు రాస్తే ప్రజలకు ఉపయోగపడతాయన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, మహిళలను కించపరుస్తూ ప్రసారాలు చేయటం బాధాకరమన్నారు.

ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోరు..

రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి ఏబీఎన్‌ రాధాకృష్ణ అనుచితంగా మాట్లడినా ప్రభుత్వం దృష్టిలో నేరం కాదా.. అని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ నేతలను సోషల్‌ మీడియా వేదికగా ఏవరైన చిన్న మాట అంటే అదే రోజు అర్ధరాత్రిళ్లు ఇళ్ల మీదకు వెళ్లి అరెస్ట్‌లు చేసే పోలీసులు రాధాకృష్ణపై ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారో తెలపాలన్నారు. చంద్రబాబు దృష్టిలో టీడీపీకి సంబంధించిన వారు మహిళలను ధూషిస్తే తప్పు లేదన్నట్లుగా ఉన్నారన్నారు. జిల్లాలో తరచూ టీడీపీ నేతలు.. వైఎస్సార్‌సీపీ నాయకులు, సామాన్య ప్రజలపై దాడులకు పాల్పడుతున్నా పోలీసులు మౌనం వహిస్తున్నారని విమర్శించారు. మహిళలపై అనుచిత వాఖ్యలు చేసిన రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇది కమీషన్ల సర్కారు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

కాటసాని రాంభూపాల్‌రెడ్డి

నంద్యాల: కూటమి ప్రభుత్వం కమీషన్ల సర్కార్‌గా మారి ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. సోమవారం పట్టణంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి , శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, నంద్యాల నియోజకవర్గ పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి , శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకుడు పీపీ మధుసూదన్‌ రెడ్డిలు ప్రజా సమస్యలు పరిష్కరించాలని డీఆర్‌ఓ రాము నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత నెలకొందని, బంకుల వద్ద ‘నో స్టాక్‌’ బోర్డులు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పంట దిగుబడి సమయంలో డీజిల్‌ లభించక రైతులు అవస్థలు పడుతున్నారని, గిట్టుబాటు ధర కల్పించడంలోనూ, ఎరువుల పంపిణీలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఉచిత ఇసుక అనేది కేవలం మాటలకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో డబ్బులు ఇస్తే తప్ప ఇసుక దొరకని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సంపద సృష్టించడం అంటే బెల్ట్‌ షాపులు పెంచడమేనా? అని ప్రశ్నించారు. అడుగడుగునా మద్యం అందుబాటులోకి తెచ్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికై నా చోద్యం చూడటం ఆపి తక్షణమే ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement