పీజీఆర్‌ఎస్‌లో 80 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌లో 80 ఫిర్యాదులు

Apr 28 2026 8:05 AM | Updated on Apr 28 2026 8:05 AM

బొమ్మలసత్రం: జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి అర్జీదారుల నుంచి 80 వినతులు అందినట్లు జిల్లా ఎస్పీ సునీల్‌ షెరాన్‌ తెలిపారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా ప్రజల నుంచి అందిన వినతుల్లో కొన్ని అక్కడికక్కడే పరిష్కరించామన్నారు. మరికొన్ని సమస్యలను ఆయా స్టేషన్‌ అధికారులకు పంపామన్నారు. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేసి తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ఒక వేళ వినతులు పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

29న నేషనల్‌ ఐటీఐలో ఉద్యోగ మేళా

నంద్యాల(న్యూటౌన్‌): పట్టణంలోని నేషనల్‌ ఐటీఐ కళాశాలలో ఈనెల 29వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కల్యాణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాబ్‌ మేళాకు శ్రీరామ్‌చిట్స్‌ కంపెనీ, స్పందన, టాటా, తదితర కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. టెక్నికల్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌, రుణాలు, ప్రొడక్షన్‌, తదితర ఉద్యోగాలు కల్పిస్తారన్నారు. నిరుద్యోగులు డిగ్రీ, ఐటీఐ, డిప్లొమో చదివి ఉండాలన్నారు. జాబ్‌ మేళాకు హాజరయ్యే విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకొని హాజరు కావాలన్నారు.

అన్నప్రసాద వితరణకు రూ.4 లక్షల విరాళాలు

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి పలువురు భక్తులు రూ.4 లక్షల విరాళాలు అందించారు. సోమవారం హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌కు చెందిన ఈశ్వర్‌ ప్రకాష్‌ వశిష్ట రూ.1,25,000 విరాళాన్ని, అలాగే నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఎ.సతీష్‌కుమార్‌ రూ.1,10,116 విరాళాన్ని, హైదరాబాద్‌కు చెందిన ఆర్‌.చంద్రశేఖరరాజు రూ.1,00,116 విరాళాన్ని, కొండూరు ఆధ్య పేరు మీద రూ.1,00,116 విరాళాన్ని పర్యవేక్షకులు కె.అయ్యన్నకు అందజేశారు. విరాళాలను అందించిన దాతలను దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు.

జడ్జిగా గిరిధర్‌ బాబు

కర్నూలు (అర్బన్‌): నంద్యాల సెకండ్‌ క్లాస్‌ స్పెషల్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ (రైల్వేస్‌)గా ఎస్‌.గిరిధర్‌ బాబును నియమించారు. ఈ మేరకు న్యాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శి గొట్టపు ప్రతిభాదేవి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

1 నుంచి వేసవి సెలవులు

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో 2025–26 విద్యా సంవత్సరానికి వర్సిటీ అనుబంధ యూజీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, ఎమ్‌ఈడీ, ఎమ్‌పీఈడీ, లా కళాశాలలకు మే 1వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు వర్సిటీ అకడమిక్‌ అఫైర్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ సీవీ కృష్ణారెడ్డి తెలిపారు. జూన్‌ 14వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని, జూన్‌ 15వ తేదీన పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

ఖైదీలకు ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తాం

నందికొట్కూరు: ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు ఉచితంగా న్యాయవాది ఏర్పాటు చేస్తామని జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జిల్లా జడ్జి లీలా వెంకటశేషాద్రి అన్నారు. సోమవారం పట్టణంలోని సబ్‌జైల్‌ను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. ఖైదీలతో ముఖాముఖి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీనియర్‌ సివిల్‌ జడ్జి శోభారాణి, జూనియర్‌ సివిల్‌ జడ్జి వి. దివ్య, సబ్‌జైల్‌ ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ ఎ. శ్రీనివాసులు, ప్యానల్‌ న్యాయవాది మద్దయ్య, వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement