శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకున్నారు. వేకువ జామున పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి క్యూ లైన్లలో బారులు దీరారు. క్యూ లైన్లలో వేచివున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థాన అధికారులు తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు పంపిణీ చేశారు. భక్తుల శివ నామస్మరణతో శ్రీశైల ఆలయం మారుమోగింది.
ఉదయం 9.30 గంటల నుంచి పీజీఆర్‌ఎస్
నంద్యాల: ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఈనెల 20వ తేదీ సోమవారం నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు వినతులు ఇచ్చి సమస్యలు పరిష్కరించుకోవచ్చునన్నారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap. gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
1వ తేదీ నుంచి వేసవి
క్రీడా శిక్షణ శిబిరాలు
నంద్యాల(న్యూటౌన్): వేసవి సెలవుల్లో విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు శాప్ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31వ తేదీ వరకు వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి రాజు తెలిపారు. జిల్లాలోని 54 నిర్ణీత ప్రాంతాల్లో నిర్వహించేందుకు శిక్షకులను నియమించనున్నారు. 16 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న బాల, బాలికలకు ఇష్టమైన క్రీడా రంగంలో శిక్షణ పొందేందుకు ఇదో సువర్ణావకాశం. అర్చరీ, అథ్లెటిక్స్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, షటిల్ బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, ఫెన్సింగ్, హ్యాండ్‌బాల్, ఖోఖో, కబడ్డీ, కరాటే, సాఫ్ట్‌బాల్, తైక్వాండో, వాలీబాల్, రెజ్లింగ్ క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.


