స్వీయ జనగణనకు సహకరించండి | - | Sakshi
Sakshi News home page

స్వీయ జనగణనకు సహకరించండి

Apr 27 2026 8:00 AM | Updated on Apr 27 2026 8:00 AM

జిల్లా కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల: స్వీయ జనగణనకు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. సెన్సస్‌ ఔట్‌రీచ్‌ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు ఆదివారం పట్టణంలో 5కే రన్‌ చేపట్టారు. టెక్కె మార్కెట్‌ యార్డ్‌ నుంచి గాంధీ చౌక్‌ వరకు సాగిన ర్యాలీలో జిల్లా అధికారులు, యువత, విద్యార్థులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జనగణన ద్వారా దేశంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర అవగాహన ఏర్పడి, సరైన ప్రభుత్వ విధానాల రూపకల్పనకు ఇది బలమైన పునాదిగా నిలుస్తుందన్నారు. ప్రత్యేకంగా ‘జనగణన 2027’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన స్వీయ గణన ప్రక్రియపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఈనెల 30వ తేదీ వరకు ప్రజలు స్వీయ జనగణన ద్వారా తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ ప్రక్రియలో ఎటువంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని, కేవలం సరైన సమాచారం అందించడం ద్వారా నమోదు పూర్తవుతుందన్నారు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసిన తర్వాత ఒక ప్రత్యేకమైన ఎస్సీ ఐడీ జెనరేట్‌ అవుతుందని, అనంతరం ఎన్యుమరేటర్‌ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడిని చూపితే సరిపోతుందన్నారు. జిల్లాలో సుమారు 6 లక్షల కుటుంబాలు ఉన్నాయని, అందరూ గడువులోగా స్వీయ గణన పూర్తి చేసి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలంటే కచ్చితమైన సమాచారాన్ని అందించడం అత్యంత అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement