నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో శనివారం నిర్వహించిన పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (పాలిసెట్) ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా పాలిసెట్ కో ఆర్డినేటర్ జి.శైలేంద్రకుమార్ తెలిపారు. 2026–27 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవే టు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించిన పరీక్ష ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా సాగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 6,856 మంది హాజరైనట్లు తెలిపారు. డోన్‌లో 755, నందికొట్కూరులో 513, నంద్యాలలో 2,704, ఆత్మకూరులో 607, శ్రీశైలంలో 120, బేతంచెర్లలో 537, బనగానపల్లెలో 945, ఆళ్లగడ్డ లో 655 మంది విద్యార్థులు పరీక్ష రాశారన్నారు.
డిగ్రీ పరీక్షలకు 87 మంది విద్యార్థులు గైర్హాజరు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో శనివారం జరిగిన సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలకు 87 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. రెండో సెమిస్టర్ పరీక్షలకు 578 మందికి 490 మంది విద్యార్థులు హాజరు కాగా 87 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఆరో సెమిస్టర్ పరీక్షలకు 14 మంది హాజరైనట్లు తెలిపారు. ఎమ్మిగనూరు సిద్దార్థ డిగ్రీ కళాశాల కేంద్రాల్లో ఒక విద్యార్థి చూచిరాత పాల్పడగా డిబార్ చేశామన్నారు.
కర్నూలు: మాజీ సైనికులందరూ ఉచిత న్యాయ సహాయానికి అర్హులని, చట్టబద్ధమైన సమస్యలు ఉంటే వాటికి ఉచితంగా న్యాయాన్ని అందించి వారి సమస్యలను పరిష్కరిస్తామని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సూచనల మేరకు శనివారం కర్నూలు బి.క్యాంప్‌లో ఉన్న జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్‌ను లీలా వెంకటశేషాద్రి సందర్శించారు. మాజీ సైనికుల సమస్యలను చర్చించారు. సైనిక సంక్షేమ కార్యాలయంలో లీగల్ సర్వీసెస్ క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ న్యాయవాదితో పాటు పారా లీగల్ వాలంటీర్లు ఉంటారని తెలిపారు. లీగల్ సర్వీసెస్ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నెంబర్ 15100కు ఫోన్ చేస్తే వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. జిల్లా ఇన్‌చార్జి సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ మహేంద్రమ్మ, పారా లీగల్ వలంటీర్ మధుసూదన్, మాజీ సైనికుల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
28 నుంచి ఖాదర్‌లింగస్వామి ఉరుసు
కౌతాళం: మతసామరస్యానికి ప్రతీకగా వెలసిన జగద్గురు ఖాదర్‌లింగ స్వామి ఉరుసు కౌతాళంలో ఈనెల 28నుంచి ప్రారంభమై మే 2వ తేదీ వరకు జరగనుంది. శనివారం వివిధ దర్గాల పీఠాధిపతులతో కలిసి ఉరుసు పోస్టర్లను దర్గా ధర్మకర్త సయ్యద్ మున్నపాషా చీష్తీ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. 28న మంగళవారం స్వామి సమాధిని సుగంధ, అత్తర్ పానియాలతో (గుసుల్) శుభ్రచేస్తారని,, 29న బుధవారం గంధం, 30న గురువారం ఉరుసు ఉంటుందని తెలిపారు. ఉత్సవాలకు ఇప్పటికే దర్గా పరిసరాల్లో షామియాలను ఏర్పాటు చేశారు. దర్గాను పూర్తిగా విద్యుత్ దీపాలతో అలంకరించారు.
కర్నూలు సిటీ: జల వనరుల శాఖలోని వివిధ సర్కిల్స్‌లో పనిచేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు ఎగ్జికూటివ్ ఇంజనీర్లుగా అడ్‌హాక్ పదోన్నతి కల్పిస్తూ ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వై.రఘురామిరెడ్డి (ప్రస్తుతం నాణ్యత విభాగం కర్నూలు)ఈఈగా తెలుగుగంగా డిస్ట్రిబ్యూటరీ డివిజన్–1కు, జి.శైలేశ్వర్ (అనంతపురం జిల్లాలో పని చేస్తున్నారు) తుంగభద్ర దిగువ కాలువ ఈఈగా, నారాయణ రెడ్డిని తెలుగుగంగా నంద్యాల డివిజన్ ఈఈగా, ఎన్.భవాని ప్రసాద్ రెడ్డిని ఎస్‌ఆర్‌బీసీ డివిజన్–4 ఈఈగా పదోన్నతి కల్పించారు. బి.రఘురామిరెడ్డి (ప్రస్తుతం తెలుగుగంగా డిస్ట్రిబ్యూటరీ)ఎస్‌ఆర్‌బీసీ(కడా)ఈఈగా, ఎస్.కుమారస్వామి (ఎస్‌ఆర్‌బీసీ క్యూసీ ల్యాబ్) తెలుగుగంగా ఆళ్లగడ్డ డివిజన్ ఈఈగా, వై.చిదంబర రెడ్డిని హంద్రీనీవా డివిజన్–1 నందికొట్కూరు ఈఈగా, కె.వెంకటేశ్వర్లును చిన్న నీటిపారుదల శాఖ కర్నూలు ఈఈగా నియమించారు.


