పోలీసు బందోబస్తు మధ్య.. | - | Sakshi
Sakshi News home page

పోలీసు బందోబస్తు మధ్య..

Apr 26 2026 2:51 AM | Updated on Apr 26 2026 2:51 AM

చాగలమర్రి: మండల కేంద్రంలో మూడు రోజులుగా నెలకొన్న పెట్రోల్‌, డీజిల్‌ కొరత శనివారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణంలోని మూడు బంకుల్లో నిల్వలు నిండుకోగా.. సాయంత్రం నవనరసింహ ఫిల్లింగ్‌ స్టేషన్‌కు ట్యాంకర్‌ చేరుకుంది. ఈ సమాచారంతో వినియోగదారులు ఉదయం నుంచే క్యాన్లతో బారులు తీరారు.ట్యాంకర్‌ రాగానే స్థానిక వ్యక్తి ఒకరు ట్రాక్టర్‌లో పెద్ద డ్రమ్ములు తెచ్చి, రూ.లక్ష విలువైన డీజిల్‌ కావాలని పంపు వద్ద అడ్డుపడ్డారు. దీంతో యజమాని విక్రయాలు నిలిపివేయగా, క్యూలో ఉన్న వారు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ససమాచారం అందుకున్న ఎస్‌ఐ రాజారెడ్డి పోలీసులతో కలిసి అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. డ్రమ్ముల ట్రాక్టర్‌ను పక్కకు తొలగించి, క్యూలో ఉన్న వారికి ఒక్కొక్కరికి రూ.2 వేల వంతున ఇంధనం పంపిణీ చేయించారు. పంట కోతల సమయంలో డీజిల్‌ దొరక్క హార్వెస్టర్లు, ట్రాక్టర్లు నిలిచిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే తీవ్రంగా నష్టపోతామని, అధికారులు స్పందించి ఇంధన కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.

స్తంభించిన ట్రాఫిక్‌.. వధూవరుల పాట్లు

బంకు వద్ద వాహనాల రద్దీతో రహదారిపై సుమారు 2 గంటల పాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అహోబిలం వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రామతీర్థం వద్ద వివాహానికి వెళ్తున్న వధూవరులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో, వాహనం దిగి నడుచుకుంటూ అవతలి వైపునకు వెళ్లి వేరే వాహనాల్లో కల్యాణ మండపానికి చేరుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement