ప్రశాంతంగా ఏపీఆర్‌జేసీ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఏపీఆర్‌జేసీ పరీక్షలు

Apr 25 2026 8:18 AM | Updated on Apr 25 2026 8:18 AM

నంద్యాల(న్యూటౌన్‌): 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి గురుకులాల్లో 6, 7, 8 తరగతులతో పాటు ఇంటర్మీడియెట్‌, డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థుల ప్రవేశం కోసం జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం జరిగిన ఏపీఆర్‌ఎస్‌ సీఏటీ ప్రవేశ పరీక్షలకు మొత్తం 1,044 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 877 మంది హాజరు కాగా 166 మంది గైర్హాజరయ్యారు. అదే విధంగా మధ్యాహ్నం జరిగిన ఏపీఆర్‌జేసీ, డీసీసెట్‌ ప్రవేశ పరీక్షలకు మొత్తం 1,924 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,741 మంది హాజరు కాగా, 183 మంది గైర్హాజరైనట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి తెలిపారు.

సఖీ నివాస్‌కు దరఖాస్తుల ఆహ్వానం

నంద్యాల(అర్బన్‌): నంద్యాల పట్టణంలో ఏర్పాటు కానున్న సఖీ నివాస్‌ (వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టల్‌) కోసం మానవ వనరుల సరఫరా నిమిత్తం నమోదిత ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు అభివృద్ధి సాధికారత అధికారిణి లీలావతి దేవి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. డిస్ట్రిక్ట్‌ ఉమెన్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ అండ్‌ ఎంపవర్‌ మెంట్‌ ఆఫీసర్‌ నంద్యాల వారి పేరు మీద దరఖాస్తు రుసుం రూ.500తో డిమాండ్‌ డ్రాప్ట్‌ తీసి కార్యాలయంలో అందజేసి టెండరు ఫారం పొందాలన్నారు. ఈనెల 29వ మధ్యాహ్నం 3 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు. పోస్టులు, ఇతర వివరాల కోసం డీడబ్ల్యూ సీడబ్ల్యూఈఓ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

బెలుం గుహలపై వేసవి ఎఫెక్ట్‌

కొలిమిగుండ్ల: రోజు రోజుకు ఎండలు భగ్గుమంటున్నాయి. ఇళ్లలో నుంచి జనం బయటకు వచ్చేందుకు సాహసం చేయడం లేదు. పర్యాటక కేంద్రమైన బెలుం గుహలపై వేసవి తీవ్ర ప్రభా వం చూపుతోంది. సహజ సిద్ధంగా అవతరించిన బెలుం గుహల అందాలను ఆస్వాదించేందుకు ఉమ్మడి తెలుగు రాష్రాలు, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలతో పాటు విదేశీయులు సైతం అధికంగా వస్తుంటారు. అయితే ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగానే నమోదు అవుతున్న కారణంగా పర్యాటక ప్రాంతాల సందర్శనను యాత్రికులు వాయిదా వేసుకుంటున్నారు. బెలుం గుహల సందర్శనకు యాత్రికులు లేక వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం గుహలకు రోజు రూ.10 వేల లోపు మాత్రమే ఆదాయం వస్తుంది. శని, ఆదివారాల్లో సైతం అంతంత మాత్రంగానే వస్తున్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు అయినా ఎండల తీవ్రత కారణంగా బయట ప్రాంతాలకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు.

మెరుగైన వసతుల కల్పనకుప్రణాళిక రూపొందించండి

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల పట్ల కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వసతి, ఆలయం, దర్శనాలు, అన్నప్రసాద వితరణ, ఇంజినీరింగ్‌, పారిశుద్ధ్యం మొదలైన విభాగాలన్నీ తగు కాలపరిమితిని నిర్ధారించుకుని తదనుగుణంగా సౌకర్యాలను మెరుగుపర్చాలని ఆదేశించారు. దేవస్థానంలో ప్రతి ఉద్యోగి కూడా సౌకర్యాల కల్పనే ప్రధాన లక్ష్యంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. దేవస్థానం భక్తులకు అందిస్తున్న సౌకర్యాల పట్ల భక్తులు 90 శాతం సానుకూలత స్పందన ఉండాలన్నారు. వేసవీ తీవ్రత దృష్ట్యా ఆలయంలో, క్షేత్ర పరిధిలో పలుచోట్ల చలువపందిళ్లు, గ్రీన్‌మ్యాట్‌ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అన్ని శాఖల అధికారులు, వివిధ విభాగాల పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

ఉదయమే పంటలు తీసుకురావాలి

కర్నూలు(అర్బన్‌): ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున మార్కెట్‌యార్డుకు రైతులు తమ పంట ఉత్పత్తులను ఈ నెల 27వ తేదీ నుంచి ఉదయం 9 గంటల్లోపు తీసుకు రవావాలని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఎంపిక శ్రేణి కార్యదర్శి ఆర్‌ జయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలియజేసిన సమయానికే వ్యాపారులు కూడా టెండర్‌ వేయాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement