శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లో హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపేణా రూ.4,83,22,554 లభించినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆలయంలోని అలంకార మండపంలో గత 33 రోజుల వ్యవధిలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించినట్లు చెప్పారు. బంగారం 162.200 గ్రాములు, వెండి 4.180 కేజీలు లభించాయన్నారు. నగదు, బంగారం, వెండితో పాటు యూఎస్‌ఏ డాలర్లు–144, శ్రీలంక రూపి–9,870, యూఏఈ దిర్హమ్స్–90, సౌదీరియాల్స్–120, ఇంగ్లాండ్ పౌండ్స్–20, మలేషియా రింగిట్స్–151, ఆస్ట్రేలియా డాలర్లు–25, యురోలు–30, కెనడా డాలర్లు–25, కువైట్ దినార్–1, న్యూజిలాండ్ డాలర్లు–30 వచ్చినట్లు ఈఓ తెలిపారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపు చేపట్టామన్నారు. హుండీల లెక్కింపులో పలు యూనిట్ విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.


