నంద్యాల(న్యూటౌన్): 2026–27 విద్యాసంవత్సరానికి గాను ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, డిప్లొమో ప్రవేశాల కోసం ఈనెల 25న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు 8 పరీక్ష కేంద్రాల్లో పాలిసెట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా పాలిసెట్ కో ఆర్డినేటర్ శైలేంద్రకుమార్ తెలిపారు. గురువారం ప్రభుత్వ ఈఎస్సీ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాలిసెట్‌కు ఏర్పాట్లు చేస్తామన్నారు. డోన్‌లో 798 మంది, నందికొట్కూరులో 533, నంద్యాలలో 2868, ఆత్మకూరులో 638, శ్రీశైలంలో 140, బేతంచెర్లలో 560, బనగానపల్లెలో 989 మంది, ఆళ్లగడ్డలో 695 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం 9912377723ను సంప్రదించాలన్నారు.
పోస్టాఫీసుల్లో కొత్త ఆధార్ నమోదు కేంద్రాలు
నంద్యాల(వ్యవసాయం): పోస్టాఫీసుల్లో ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్, కొత్త ఆధార్ నమోదు చేసుకోవచ్చని నంద్యాల డివిజనల్ పోస్టల్ సూపరింటెడ్ బి.అప్పలస్వామి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల హెడ్ పోస్ట్ ఆఫీస్, రైల్వే స్టేషన్‌లోని పోస్టాఫీస్, ఆళ్లగడ్డ ఎండీజీ, పాణ్యం సబ్ పోస్టాఫీస్, ఎస్‌ఎస్ డాం ఈస్ట్ సబ్ పోస్టాఫీస్‌లో కొత్త ఆధార్ నమోదు, ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
శిరివెళ్ల: పొదుపు సంఘాల మహిళలు రుణాలు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి అన్నారు. గురువారం వెలుగు కార్యాలయంలో వార్షిక జీవనోపాధుల రుణ ప్రణాళికపై డ్వాక్రా సంఘాలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడు తూ మహిళల జీవనోపాధులకు ఎంత నిధులు కావాలని ఒక నిర్థష్ట ప్రణాళికలు రూపొందింస్తున్నామన్నారు. బ్యాంక్ లింకేజీ, సీ్త్ర నిధి, ఉన్నతి వంటి పథకాల ద్వారా రుణాలను మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. పొదుపు రుణాలతో మహిళలు స్వయం ఉపాధిలో రాణించాలన్నారు. సమావేశంలో ఏపీఎం రాజశేఖరరెడ్డి, సంఘాల లీడర్లు, సీసీలు పాల్గొన్నారు.
పాఠశాలలకు వేసవి సెలవులు
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లో పని చేస్తున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు గురువారం నుంచి సెలవులు ప్రకటించినట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉందని, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సెలవులు ప్రకటిచిందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఈఓ తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు.
మహనీయుడు
భగీరథ మహర్షి
నంద్యాల: తపస్సుతో గంగాదేవిని భువికి తీసుకొచ్చిన భగీరథ మహర్షి మహనీయుడని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకుని భగీరథ చిత్రపటానికి డీఆర్‌ఓ, సగర (ఉప్పర) సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ.. భగీరథ మహర్షి గంగను భూమిపైకి తీసుకువచ్చిన పట్టుదల జల సంరక్షణకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. కఠోర శ్రమ చేసి దేనినైనా సాధించగలమని భగీరథ మహర్షి నిరూపించారని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని యువత లక్ష్యాలను సాధించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని వినియోగించుకోవాలన్నారు. వెనుకబడిన తరగతుల వారి జీవన ప్ర మాణాలను మెరుగుపరిచేందుకు చేపడుతున్న కార్యాచరణను పూర్తిస్థాయి ఫలాలు వారికి అందేలా నిరంతరం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సగర వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ సురేష్ కుమార్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గోవర్ధన్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఓబులేసు, హాస్టల్ వార్డెన్ ఇన్‌చార్జ్ మునిరాజు, బీసీ వెల్ఫేర్ సెక్రటరీ షబ్బీర్, నంద్యాల అసెంబ్లీ సంఘం అధ్యక్షుడు బి.బాలాజీ, యువజన సంఘం అధ్యక్షుడు యు.హరికిరణ్, గురు ప్రసాద్, శివ ప్రసాద్ పాల్గొన్నారు.


