వరి రైతుకు వాన దెబ్బ | - | Sakshi
Sakshi News home page

వరి రైతుకు వాన దెబ్బ

Apr 24 2026 6:02 AM | Updated on Apr 24 2026 6:02 AM

రెడ్డిపల్లె వద్ద పొలంలో విరిగి పడిన

విద్యుత్‌ స్తంభం

కొండమాయపల్లె సమీపంలో నీట మునిగిన ధాన్యాన్ని బయటకు తీస్తున్న రైతులు

రుద్రవరం: గాలివాన దెబ్బకు వరి రైతులు కుదేలయ్యారు. కోతలు కోసి ఆరబోసిన ధాన్యం వర్షపు నీటిలో తడిసిపోయింది. కోత దశలో ఉన్న పైర్లు పూర్తిగా నేల వాలాయి. మండల కేంద్రమైన రుద్రవరంతో పాటు కొండమాయపల్లె, ఆర్‌.కొత్తూరు, చందలూరు, మాచినేనిపల్లె, రెడ్డిపల్లె, ఆర్‌.నాగులవరం తదితర గ్రామాల్లో బుధవారం రాత్రి గాలివాన కురిసింది. కోత దశలో ఉన్న వరి, మొక్కజొన్న పైర్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. కోతలు పూర్తయి పొలాల్లోనే ఆరబోసిన ధాన్యం పూర్తిగా నీట మునిగింది. పట్టలు కప్పకుండా రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యం, మొక్కజొన్నలు తడిసి పోయాయి. రాత్రి వర్షం కురవడంతో కల్లాల్లో ఉన్న దిగుబడిని కాపాడుకోలేక పోయారు. గురువారం ఉదయం పొలాల్లో నేలవాలిన పంటను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. వెంటనే కూలీల సాయంతో నీట మునిగిన ధాన్యాన్ని బయటకు తీసి ఆరబోశారు. అలాగే మొక్కజొన్న, మామిడి రైతులు కూడా నష్టపోయారు. గాలివానకు మండలంలో దాదాపు 39 విద్యుత్‌ స్తంభాలు పడిపోయి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వెంటనే మరమ్మతులు చేపడుతున్నట్లు ఏఈ రాజశేఖర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement